సీఎం జగన్ కి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ రాశారు. అకాల వర్షాల వల్ల పంట నష్టం జరిగిన ప్రాంతాలలో సీపీఐ, రైతు సంఘాల ప్రతినిధి బృందం పర్యటించి, పరిశీలించిందన్నారు. చేతికొచ్చిన పంట నష్టపోయి రైతులు లబోదిబోమంటున్నారని వెల్లడించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం రైతుల పాలిట శాపంగా మారిందన్నారు. పసుపు, మొక్కజొన్న పంటలకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఉంటే పంట నష్టం జరిగి ఉండేది కాదని సీపీఐ రామకృష్ణ పేర్కొన్నారు. పంటలకు మద్దతు ధర ప్రకారం కొనుగోళ్లు జరగటం లేదన్నారు. తక్షణమే రెవెన్యూ, వ్యవసాయ శాఖల అధికారులచే పంట నష్టాన్ని అంచనా వేయించి, రైతాంగాన్ని ఆదుకోవాలని కోరారు. పసుపు పంటకు ఎకరాకు లక్ష రూపాయలు, మొక్కజొన్న పంటకు ఎకరాకు రూ.40 వేలు చొప్పున నష్టపరిహారం చెల్లించాలని రామకృష్ణ పేర్కొన్నారు.