మన్యంలో బలహీన గిరిజనుల తలరాత మారునుందా? ఆర్థిక పరిస్థితులు మెరుగుపడనున్నాయా? వారి ప్రాంతాలకు మౌలిక వసతులు సమకూరుతాయా!.. వారి స్థితిగతులపై ఇటీవల ఐటీడీఏ అధికారులు సర్వే చేపట్టారు. దీంతో అందరిలోనూ ఎన్నో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అసలు పార్వతీపురం, సీతంపేట ఐటీడీఏల పరిధిలో ఆరు గిరిజన తెగలు ఉన్నాయి. వాటిల్లో ఒకటే బలహీన గిరిజనుల సమూహం. వారినే పీవీటీజీలు అని అంటారు. వారు ఏజెన్సీలోని గిరి శిఖర గ్రామాల్లో ఉంటారు. పోడు వ్యవసాయమే ఆధారం. రెండు ఐటీడీఏల్లో మొత్తంగా లక్షా 87 వేల మంది ఉన్నారు. కాగా పీవీటీజీల సామాజిక, ఆర్థిక పరిస్థితులు మెరుగుపర్చాలని ఉద్దేశంతో కేంద్ర సర్కారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పీఎం మిషన్ పథకానికి శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా దేశంలో ఉన్న 29 రాష్ర్టాల్లో పీవీటీజీల అభివృద్ధికి ఏటా రూ.15 వేల కోట్లు అందించనుంది. ఇలా మూడేళ్ల పాటు అందజేయనుంది. ఈ నేపథ్యంలోనే పీవీటీజీలకు అవసరమైన మౌలిక సౌకర్యాల కల్పనకు ప్రణాళికలు రూపొందించి నివేదికలు అందించాలని ఐటీడీఏకు కేంద్ర గిరిజన సంక్షేమశాఖ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిలో భాగంగానే సంబంధిత అధికారులు 20 బృందాలుగా ఏర్పాటయ్యారు. ఒక్కో మండలానికి ఒక్కో సెక్టోరియల్ అధికారిని కూడా నియమించారు. వారంతా గతనెలలో సీతంపేట ఐటీడీఏ పరిధిలోని 20 సబ్‌ప్లాన్ మండలాల్లో దాదాపు 18 మండలాల్లో సర్వే చేశారు. ఆర్థికంగా, సామాజికంగా లక్షా 11 వేల 446 మంది వెనుకబడి ఉన్నట్లు గుర్తించారు.