టీడీపీ అధినేత చంద్రబాబు తిరుపతి జిల్లా పర్యటన మరోసారి వాయిదా పడింది. టీడీపీ కేంద్ర కార్యాలయం నుంచీ విడుదలైన సమాచారం మేరకు ఈ నెల 10, 11, 12 తేదీల్లో ఆయన జిల్లాలో పర్యటించనున్నారు. వాస్తవానికి తొలుత ఖరారైన మేరకు ఈనెల 2, 3, 4 తేదీల్లో వెంకటగిరి, గూడూరు, సూళ్ళూరుపేట నియోజకవర్గాల్లో పర్యటించాల్సి వుండింది. ఈ మూడు నియోజకవర్గ కేంద్రాల్లో ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా పర్యటించి రోడ్ షోలు, బహిరంగసభల్లో పాల్గొనాల్సి వుండింది. అయితే అకాల వర్షాల కారణంగా ఆ తేదీల్లో పర్యటన రద్దు చేసుకుని తదుపరి పర్యటనను 4, 5, 6 తేదీల్లో ఖరారు చేసుకున్నారు. ఆ మేరకు ఆయా నియోజకవర్గాల పార్టీ నేతలకు కూడా సమాచారమిచ్చారు. కానీ వర్షాల ప్రభావం ఇంకా కొనసాగుతుందని తెలియడంతో ఆ షెడ్యూలు కూడా రద్దయింది. అంతిమంగా వర్షాల ప్రభావం తగ్గాక ఈ నెల 10, 11, 12 తేదీల్లో జిల్లాలో పర్యటించేలా కార్యక్రమం ఖరారైంది. అయితే పర్యటన సూళ్ళూరుపేట నుంచీ ప్రారభం అవుతుందా లేక వెంకటగిరి నుంచీ ప్రారంభమవుతుందా అన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు.