నెల రోజుల పాటు శుక్రమూఢమి ప్రభావంతో నిలిచిపోయిన శుభకార్యాలు చేసుకునేందుకు అవకాశం కలిగింది. నేటి నుంచి 30 వతేదీ వరకు దివ్యమైన ముహూర్తాలు ఉండడంతో అన్ని రకాల శుభకార్యాలు చేసేందుకు ప్రజలు సన్నద్ధమవుతున్నారు. వివాహాలు, గ్రామ దేవతల పండగలు, గృహ ప్రవేశాలు ఇతర శుభకార్యాలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఆగస్టు 20 వరకు మంచి ముహూర్తాలు లేకపోవడంతో ఈనెల 3 నుంచి జూన్ 14లోపే శుభ కార్యాలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా ఈ నెలలో 3, 6, 8, 9, 10, 11, 15, 16, 20, 21, 22, 27, 29, 30 తేదీల్లో అధిక సంఖ్యలో వివాహాలు జరగనున్నాయి. వేలాది జంటలు ఒక్కటి కానున్నాయి. ఈ నేపథ్యంలో కల్యాణమండపాలు, ప్లాజాలు, టౌన్ హాల్స్, సామాజిక భవనాలు, వివిధ ఆలయ ప్రాంగణాలను ముందస్తుగా బుక్ చేసుకున్నారు. వంట మనుషులు మొదలుకొని పురోహితులు, నాయీ బ్రాహ్మణులు, వీడియో, ఫొటోగ్రాఫర్లు, షామియానా సప్లయిర్స్, లైటింగ్స్, జనరేటర్స్, డీజే సౌండింగ్స్, ఫ్లవర్ డెకరేటర్స్, బ్యూటీషన్స్, వాహనాలు, ఫ్లెక్సీలు, పూల దుకాణాలు ఇలా ఎవర్ని పలకరించినా మే నెలలో ఖాళీ లేదంటున్నారు. పెళ్లిళ్ల సీజన్ నేపథ్యంలో కూరగాయల ధరలు కూడా పెరిగాయి. వస్త్రదుకాణాలు, కిరాణాషాపులు, బంగారం, వెండి షాపులు రద్దీగానే కనిపిస్తు న్నాయి.