పాకిస్తాన్ అంటేనే ఉగ్రదాడులకు పేరు. అలాంటి పాకిస్థాన్ లో తీవ్రవాద దాడులు ఏప్రిల్ నెలలో పెరిగాయి. గత నెలలో మొత్తం 48 ఉగ్రదాడి ఘటనలు జరగగా, 68 మంది మృతి చెందగా, 55 మంది గాయపడినట్లుగా తాజా నివేదిక ఒకటి వెల్లడించింది. పాకిస్థాన్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ కాన్‌ఫ్లిక్ట్ అండ్ సెక్యూరిటీ స్టడీస్ మంగళవారం విడుదల చేసిన తన నివేదికలో.. మార్చిలో 39 మిలిటెంట్ దాడులు నమోదు కాగా ఈ ఘటనల్లో 58 మంది మృతి చెందారని, 73 మంది గాయపడినట్లు తెలిపింది. గత నెలలో ఉగ్రవాదుల దాడుల్లో 23 శాతం పెరుగుదల, మరణాలు 17 శాతం పెరిగినట్లు వెల్లడించింది. గాయపడ్డ వారి సంఖ్య మాత్రమే 25 శాతం తగ్గిందని ఈ ఇస్లామాబాద్ థింక్ ట్యాంక్ వెల్లడించింది.
భద్రతా బలగాల మరణాలు ఏప్రిల్ నెలలో 35 శాతం పెరిగాయి. పాక్ సెక్యూరిటీ... ఉగ్రవాద సంస్థలపై తమ దాడిని పెంచినట్లు తెలిపింది. ఏప్రిల్‌లో సెక్యూరిటీ సిబ్బంది దాదాపు 41 మంది ఉగ్రవాదులను హతమార్చినట్లు వెల్లడించింది. అలాగే 40 మందిని అరెస్ట్ చేశారని నివేదిక పేర్కొంది. ఉగ్రదాడుల్లో ఖైబర్ పఖ్తుంఖ్వా అత్యంత ప్రభావిత ప్రావిన్స్ గా మిగిలిందని, ఏప్రిల్ లో ఇక్కడే 49 శాతం నమోదయినట్లు వెల్లడించింది. కాగా, ఈ ఏడాది జనవరి నుండి పాకిస్థాన్‌లో 436 ఉగ్రవాద దాడుల్లో మొత్తం 293 మంది మరణించగా, 521 మంది గాయపడ్డారని మిలటరీ మీడియా వింగ్ ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్ గతవారం తెలిపింది.