డా. బీఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం మూడు నెలలుగా జీతాలు చెల్లించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో జీతాల కోసం రోడ్డెక్కే పరిస్థితిని ప్రభుత్వమే కల్పిస్తోందని గురుకుల ఉద్యోగులు హెచ్చరిస్తున్నారు. ఉన్నతాధికారులను అడిగితే.. ప్రభుత్వం నుంచి నిధులు రాలేదని, తామేమీ చేయలేమని అంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 189 ఎస్సీ గురుకుల విద్యాలయాలున్నాయి. అందులో రెగ్యులర్ ఉద్యోగులు 2,500 మంది, కాంట్రాక్ట్ పద్ధతిన 850 మంది, పార్ట్‌టైం ఉద్యోగులు మరో 1,700 మంది పనిచేస్తున్నారు. వీరు కాకుండా సెక్యూరిటీ, శానిటేషన్ సిబ్బంది మరో 2.500 మంది దాకా ఉన్నారు. గురుకులాల ప్రిన్సిపాల్స్ మొదలు.. శానిటేషన్ సిబ్బంది వరకూ అందరూ జీతాల కోసం ఎదురుచూస్తున్నారు. అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు మాత్రమే జీతాలు చెల్లించారు. మిగిలినవారికి ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకూ జీతాలు ప్రభుత్వం చెల్లించలేదు. ప్రతినెలా రాష్ట్రంలోని అన్ని గురుకులాల్లో పనిచేసే ఉద్యోగులు, సిబ్బందికి నెలకు రూ.30 కోట్ల దాకా జీతాలు చెల్లించాల్సి ఉంది. ఈ లెక్కన మూడు నెలలకు సంబంధించి రూ.90 కోట్లు పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం.