అమాయకులను మోసగిస్తూ డబ్బులు కాజేస్తున్న అంతర్రాష్ట్ర నకిలీ పోలీసు ముఠాను గురువారం అరెస్టు చేసినట్లు డి. ఎస్. పి సుధాకర్ రెడ్డి తెలిపారు. కర్ణాటక రాష్ట్రం ములభాగల్ కు చెందిన శివన్న (57) ములభాగల్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ అందులో నష్టం రావడంతో ఇల్లు గడవడం కష్టంగా భావించి చెడు వ్యసనాలకు బానిస అయ్యాడు. అప్పుల వారి ఒత్తిడి చేయడంతో సులభమైన మార్గంలో డబ్బులు సంపాదించాలని దురుద్దేశంతో బెంగళూరుకు చెందిన డానియల్ (50), ములభాగాల్ కు చెందిన జమీర్ భాష (33), కోలార్ జిల్లాకు చెందిన ఇమ్రాన్ (29) వెంకటేశయ్య శెట్టి (75) ముఠాగా ఏర్పడి శ్రీనివాస పురానికి చెందిన రియాజ్ ఖాన్ ను వీకోటలో కలిసి , తమకు స్వామి అనే వ్యక్తి తెలుసునని అతను తన వద్ద ఉన్న రెండు వేల రూపాయలు నోట్లు మార్చుకోవాలనుకుంటున్నాడని అతడికి ఒక లక్ష రూపాయలు విలువచేసే 500 రూపాయలు నోట్లు ఇస్తే దానికి బదులుగా అతడు రు. 1, 20, 000 విలువచేసే రు. 2, 000 నోట్లు ఇస్తాడని నమ్మబలికారు. ఈ క్రమంలో గత నెల 27 వ తేదీన జమీర్ భాషను డబ్బులు మార్చుకునేందుకు కుప్పం రోడ్డులో ఉన్న దాసర్లపల్లి సమీపం వద్ద పెట్రోల్ బంకు వద్దకు రావాలని తెలిపారు. అనంతరం జనసంచారం అధికంగా ఉంటుందని అక్కడ డబ్బులు మార్చుకోవడం ఎవరైనా చూస్తే ఇబ్బంది కలుగుతుందని అట్రపల్లి క్రాస్ వద్దకు అతన్ని తీసుకెళ్లారు. సంఘటన స్థలానికి నకిలీ డి. ఎస్. పి అవతారమెతిన డానియల్ తన బృందంతో వెళ్లి వారిని బెదిరించి వారి వద్ద నుండి ఐదు లక్షల రూపాయలు బలవంతంగా తీసుకుని పారిపోయారు. గురువారం ఈ సంఘటన పై బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుండి 8 లక్షల రూపాయల విలువైన సొత్తును స్వాధీన పరుచుకుని వారిని కోర్టుకు తరలించినట్లు తెలిపారు. ఈ కేసును చేదించిన సీఐ ప్రసాద్ బాబు, ఎస్సై రాంగోపాల్ ఇతర పోలీస్ సిబ్బందిని డిఎస్పి అభినందించారు.