నల్లమల అటవీ ప్రాంతంలో రెండు రోజులుగా కురిసిన భారీవర్షాలకు వచ్చిన వరదనీరు వెలిగొండ ప్రాజెక్టులోని రెండు సొరంగాల్లోకి చేరింది. రెండవ సొరంగం వ్యాసం 9 మీటర్లు కాగా 6 మీటర్ల వరకు వరదనీరు చేరింది. దీంతో ఆ సొరంగం నుంచి నిర్మాణ పనుల నిమిత్తం ఏర్పాటు చేసిన అప్రోచ్ కాలువలు (రెండు టన్నెళ్లను కలుపుతూ తీసిన తూములు) ద్వారా మొదటి సొరంగంలోకి కూడా వరద నీరు చేరుకుంది. దీంతో ఇంజనీరింగ్ అధికారులు నిర్మాణం పనులను తాత్కాలికంగా నిలిపివేసి నీటిని తోడే ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకుగానూ యంత్రాలను ఏర్పాటు చేస్తున్నారు. గతంలో కూడా హెడ్ రెగ్యులేటర్ వద్ద లీకులు ఏర్పడి వరద నీరు టన్నెళ్లలోకి చేరింది. దీంతో ఆందోళన చెందిన ప్రాజెక్టు అధికారులు నీటిని గడ్డ కట్టించే రసాయనాలతో మరమ్మతులు నిర్వహించి అప్పట్లో లీకులను నిలువరించిన విషయం తెలిసిందే. కాగా.. టన్నెళ్లలోకి చేరిన వరద నీటిని బయటకు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, నీటిని తోడి రెండు రోజుల్లో పనులు పునఃప్రారంభిస్తామని ప్రాజెక్టు ఎస్‌ఈ అబూతాలిమ్ తెలిపారు.