ఏపీ సహకార సొసైటీల సవరణ చట్టానికి అనుగుణంగా రాష్ట్రంలోని జిల్లా సహకార కేంద్ర బ్యాంకు(డీసీసీబీ)ల్లో పనిచేస్తున్న జనరల్ మేనేజర్లు(జీఎం), డిప్యూటీ జనరల్ మేనేజర్ల(డీజీఎం)ను బదిలీ చేయొద్దని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది. ఇప్పటికే బదిలీ అయిన అధికారులకు సమ్మతమైతే అక్కడే కొనసాగవచ్చని, లేకుంటే వారి పూర్వస్థానానికి వెళ్లవచ్చని స్పష్టం చేసింది. బ్యాంకు అధికారులు అంగీకరిస్తేనే బదిలీ చేయాలని పేర్కొంది. వ్యాజ్యాలపై వేసవి సెలవుల తరువాత విచారణ జరుపుతామంటూ వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, జస్టిస్ వెంకట జ్యోతిర్మయితో కూడిన ఽధర్మాసనం బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని డీసీసీబీల్లో పనిచేస్తున్న జీఎం, డీజీఎంలను రాష్ట్రస్థాయిలో బదిలీ చేసేందుకు వీలుగా ఏపీ సహకార సొసైటీల చట్టానికి సవరణ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని(యాక్ట్ 23/2022) సవాల్ చేస్తూ ఏపీ జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల ఉద్యోగుల సంఘం(ఏపీసీసీబీఈఏ) వివిధ జిల్లాల సహకార కేంద్ర బ్యాంకుల్లో పనిచేస్తున్న జీఎం, డీజీఎంలు హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యాలపై గురువారం విచారణ జరిగింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది వైవీ రవిప్రసాద్ వాదనలు వినిపిస్తూ డీసీసీబీలు ఏ జిల్లాకు ఆ జిల్లాలో అటానమ్‌సగా ఉంటాయన్నారు. రాష్ట్ర స్థాయిలో బదిలీలకు వీలుగా ఆ బ్యాంకులన్నింటినీ ఒకే గొడుగు కిందికి తీసుకొస్తూ ప్రభుత్వం చేసిన చట్టసవరణ చెల్లుబాటు కాదన్నారు.