ఆంధ్రా-ఒడిసా సరిహద్దు ప్రాంతంలో ట్రాక్టర్ బోల్తాపడి నలుగురు మృతిచెందారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఒడిసా రాష్ట్రం మల్కన్‌గిరి జిల్లా చిత్రకొండ బ్లాక్ కటాఫ్ ఏరియా బోడసదర్ పంచాయతీకి చెందిన సుమారు 15 మంది బంధువు దినకార్యానికి గురువారం ఉదయం ట్రాక్టర్‌పై గాజులమామిడి పంచాయతీ తంట్లగుడ గ్రామానికి వెళ్లారు. కార్యక్రమం అనంతరం తిరిగి వస్తుండగా, ఖరిమల్ గ్రామ సమీపంలో ట్రాక్టర్ అదుపుతప్పి 30 అడుగుల లోయలోకి బోల్తాపడింది. పది మంది తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని సమీపంలోని జాన్‌బాయి ఆస్పత్రికి తీసుకువెళ్లగా, అక్కడ చికిత్స పొందుతూ ముగ్గురు మృతిచెందారు. మిగిలిన వారిని మెరుగైన వైద్యం కోసం చిత్రకొండ ఆస్పత్రికి తరలించారు. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా మారడంతో మల్కన్‌గిరి ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరొకరు మృతిచెందారు. మృతుల్లో ఐదేళ్ల చిన్నారి కూడా ఉంది. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని బాధితుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.