అమరావతి రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతుల్లో చాలామందికి నేటికీ రిటర్నబుల్ ప్లాట్లు ఇవ్వని వైసీపీ ప్రభుత్వం మరోవైపు పేదలకు ఇళ్ల పేరుతో వేరే ప్రాంతాల వారికి భూములు ఇచ్చేందుకు సిద్దమైనది. భూములు ఇచ్చిన రైతులకు నివాస, వాణిజ్య, విల్లాస్ ప్లాట్ల్ కోసం మార్కింగ్ చేసిన లేఅవుట్లలో ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదు. అయినా పేదల ఇళ్ల స్థలాలకు వేస్తున్న 10 లేఅవుట్లకు సకల సదుపాయాలు కల్పించేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతున్నది. మే 15వ తేదీని గడువుగా నిర్దేశించుకుని చకాచకా పనులు చేస్తున్నది. మరోవైపు ఉన్నతాధికారులు క్షేత్ర పర్యటనలు చేస్తూ స్థలాల పంపిణీకి శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో రాజధానికి భూములు ఇచ్చిన రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. కాగా కృష్ణాయపాలెం, నవులూరు, ఐనవోలు, మందడం, నిడమర్రులో 10 లేఅవుట్లలో ప్లాట్లు సిద్ధం చేస్తున్నారు. అయితే అమరావతి రాజధాని కోసం ల్యాండ్ పూలింగ్ స్కీంలో కృష్ణాయపాలెంలో 2,328 మందికి నివాస, వాణిజ్య, విల్లా ప్లాట్లు ఇవ్వాలి. నవులూరు-1లో 3,450, నవులూరు-2లో 3,769, ఐనవోలులో 2,283, నిడమర్రులో 4,019, మందడంలో 5,527 మందికి రిటర్నబుల్ ప్లాట్స్ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు 60 శాతం మందికి మాత్రమే రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఉజ్జాయింపుగా వేసిన లేఅవుట్లలో ఏపుగా తుమ్మచెట్లు పెరిగాయి. ట్రంక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. కొన్ని లేఅవుట్లలో అసలు పనులే ప్రారంభం కాలేదు.