జీవో 1ను మరింత కఠినంగా అమలు చేయాలని పోలీసు అధికారులను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆదేశించడం శోచనీయమని మాజీ రాజ్యసభ సభ్యులు, ఏపీసీసీ మీడియా చైర్మన్ డాక్టర్ ఎన్.తులసి రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. రహదారుల మీద ర్యాలీలను నిషేధిస్తూ వైసీపీ ప్రభుత్వం జనవరి 2న జారీ చేసిన జీవో-1 అప్రజాస్వామికమన్నారు. భారత రాజ్యాంగం 19వ అధికరణ ద్వారా పౌరునికి ప్రసాదించిన భావ ప్రకటనా స్వేచ్ఛకు ఇది విఘాతమని చెప్పుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ప్రజలు గొంతెత్తకుండా చేసే కుట్ర ఇది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్రిటిష్ ప్రభుత్వం కూడా ఇటువంటి దుస్సాహసానికి పాల్పడలేదన్నారు. ఎన్టీఆర్ చైతన్య యాత్ర, వైయస్సార్, చంద్రబాబు, జగన్ పాదయాత్రలు రహదారుల మీదే జరిగాయని గుర్తుచేశారు. ప్రస్తుతం ఈ జీవోకు సంబంధించి హైకోర్టు తీర్పు రిజర్వులో ఉండగా ముఖ్యమంత్రి జగన్ ఇలాంటి ఆదేశాలు ఇవ్వడం శోచనీయమని తులసిరెడ్డి వ్యాఖ్యలు చేశారు.