ప్రపంచ శాంతి బుద్ధుని బోధన వల్లే సాధ్యమవుతుందని మాజీ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. విజయవాడ గవర్నర్‌పేటలోని ఏలూరు రోడ్డులోని మసీదు సెంటర్‌లో బుద్ధుని జయంతిని పురస్కరించుకొని ధర్మదీపం ఫౌండేషన్ కార్యాలయంలో బౌద్ధ గ్రంథాలయాన్ని శుక్రవా రం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో బుద్ధప్రసాద్ ముఖ్య అతిథిగా మాట్లాడుతూ బుద్ధుని బోధనల్లో త్రిపీటకాలు ఎంతో ముఖ్యమైనవని వారిచ్చిన సందేశాలను గ్రంథరూపంలో అందించారన్నారు. వాటిని తెలుగులోకి ఈనాటికి అనువాదంలోకి తీసుకువచ్చారన్నారు. బుద్ధ విహార్ అధ్యక్షుడు గోళ్ల నారాయణరావు మాట్లాడుతూ ధర్మ దీపం ఫౌండేషన్ ఆధ్వర్యంలో బుద్ధుని సందేశాలను ప్రచారంతో పాటు కార్యాచరణ కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తియ్యకూర సీతారామిరెడ్డి, పెన్మత్స భారతి, పెన్మత్స నరేంద్ర, రవిచంద్ర రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, మొవ్వా శ్రీనివాసరెడ్డి, థాయిలాండ్, వియత్నాం, మయన్మార్ దేశాలకు చెందిన బౌద్ధ సన్యాసులు నాంగ్‌లాక్, మాన్కూల్ పాల్గొన్నారు.