దౌర్జన్యంగా నివాసమున్న ఇంటి చుట్టూ ముళ్ల కంప చెట్లును వేసి రాకపోకలకు ఇబ్బందులు కలిగిస్తున్నాడంటూ చిలమత్తూరు మండలం దోరణాలపల్లికి చెందిన వెంకటశివారెడ్డి, శ్రీరామరెడ్డిలు స్థానిక పోలీస్ స్టేషన్లో పిర్యాధు చేశారు. బాధితులు తెలిపిన వివరాల మేరకు మండలంలోని దోరణాలపల్లిలో సర్వేనంబర్ 90-1లో 2007 సంవత్సరంలో 30 సెంట్ల స్థలాన్ని కొనుగోలు చేసి అందులో ఇళ్లు కూడా నిర్మించుకున్నామన్నారు. అయితే ఇదే గ్రామానికి చెందిన శ్రీనివాసులరెడ్డి అనే వ్యక్తి దౌర్జన్యంగా ఆ స్థలం తనదేవంటూ ముళ్ల కంపలను వేసి ఇంట్లో నుంచి బయటికి రాకుండా అడ్డుకుంటున్నాడని ఆరోపించారు. ఈ స్థలానికి సంబంధించి తమ దగ్గర కొనుగోలు చేసిన రిజిస్ట్రేషన్ పత్రాలతో పాటు పట్టాదార్ పాసుపుస్తకం ఉందని, రెవెన్యూ రికార్డుల్లో తామే ఉన్నామన్నారు. అయితే అతని వద్ద ఈ స్థలానికి ఎలాంటి డాకుమంట్లు లేకపోయినా దౌర్జన్యంగా తమ స్థలాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడన్నారు. దీనిపై పోలీసులు కలుగజేసుకొని తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.