ఓ యువకుడు ఛార్జీ డబ్బులు ఇవ్వలేదని.. కదులుతున్న బస్సులో నుంచి తోసేయడంతో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ధారుణం శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకొంది. విశాఖపట్నం మధురవాడ ప్రాంతానికి చెందిన గేదెల భరత్‌కుమార్.. ఈ నెల 3న అర్ధరాత్రి విశాఖ నుంచి తన స్నేహితులతో కారులో శ్రీకాకుళం వచ్చాడు. అక్కడి నుంచి తిరిగి ఇంటికి వెళ్లాలని స్నేహితులకు చెప్పాడు. దీంతో వారు తెల్లవారుజామున భువనేశ్వర్ నుంచి విశాఖ వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సును నవభారత్ కూడలి దగ్గర ఆపేసి ఎక్కించారు.
బస్సు క్లీనర్ బొమ్మాళి అప్పన్న, డ్రైవర్ రామకృష్ణ ఛార్జీ డబ్బులు రూ.200 ఇమ్మని భరత్ కుమార్‌ను అడిగారు. తన స్నేహితులు ఫోన్‌పే చేస్తారని అతడు చెప్పాడు. ఎంతసేపటికి డబ్బులు రాకపోడంతో మళ్లీ భరత్‌ను మరోసారి అడిగారు. తన స్నేహితుల ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోందని.. విశాఖ వెళ్లిన తర్వాత ఇస్తానని చెప్పడంతో గొడవ జరిగింది.. ఇరువురి మధ్య వాగ్వాదం తర్వాత బుడుమూరు సమీపంలో భరత్‌ను రన్నింగ్ బస్సులో నుంచి బయటకు తోసేశారు.
ఈ ఘటనలో డివైడర్ మధ్యలో ఉన్న క్రాస్‌బేరియర్‌ను ఢీకొట్టడంతో భరత్ తలకు గాయమైంది.. అతడి కాలు విరిగిపోయింది. తీవ్ర గాయాలతో ఉన్న అతడ్ని వెంటనే హైవే పోలీసులు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి భరత్ బస్సెక్కిన నవభారత్ కూడలి దగ్గర బస్సుకు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజీ సాయంతో మూడు రోజుల పాటు హైవేపై దర్యాప్తు చేశారు. అలాగే మడపాం టోల్‌ప్లాజా దగ్గర ఫుటేజీలను పరిశీలించారు. వెంటనే ప్రైవేటు బస్సు డ్రైవర్, క్లీనర్‌ను ప్రశ్నించగా.. నేరం ఒప్పుకొన్నారు. పోలీసులు నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు.