భారత గగనతలంలోకి పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ (పీఐఏ)కు చెందిన విమానం ప్రవేశించినట్టు మీడియా కథనం వెలువరించింది. మే 4న బోయింగ్ 777 పీకే 248 విమానం మస్కట్ నుంచి లాహోర్‌కు బయలుదేరింది. అల్లామా ఇక్బాల్ అంతర్జాతీయ విమానాశ్రయానికి విమానం చేరుకున్న సమయంలో భారీ వర్షం కురుస్తోంది. దీంతో రన్‌వేను గుర్తించలేకపోవడం వల్ల పైలట్ ల్యాండింగ్ విరమించుకుని తిరిగి విమానాన్ని గాల్లోకి తీసుకెళ్లారు. ప్రతికూల వాతావరణం వల్ల పైలట్ పొరపాటు పడటంతో విమానం దారి తప్పి గంటకు 292 కి.మీ. వేగంతో భారత గగనతలంలోకి ప్రవేశించింది. మొత్తం 10 నిమిషాల పాటు 120 కి.మీ. భారత గగనతలంలో ఈ విమానం ప్రయాణించింది. అనంతరం అది పాక్‌లోని ముల్తాన్‌వైపు ప్రయాణించినట్లు వార్తా కథనం పేర్కొంది.
ఇదిలావుంటే ఈ పరిణామాన్ని భారత వైమానిక దళం నిశితంగా గమనించింది. విమానం భారత గగనతలంలోకి ప్రవేశించడంతో ఢిల్లీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌ను అప్రమత్తం చేసింది. ఆ ప్రాంతంలోని వాతావరణాన్ని బట్టి పొరపాటున విమానం వచ్చినట్టు గుర్తించింది. ‘ప్రతికూల వాతావరణం కారణంగా పీఐఏ విమానం భారత గగనతలంలో చక్కెర్లు కొడుతున్న విషయం గురించి లాహోర్, ఢిల్లీ మధ్య సమన్వయం జరిగింది. ఈ సమాచారం వైమానిక దళ లైజన్ విభాగానికి అందజేశారు’ అని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దీంతో భారత వాయుసేన పరిస్థితిని నిశితంగా పర్యవేక్షించింది అని పేర్కొంది.
ప్రపంచవ్యాప్తంగా విమాన రాకపోకలను గమనించే ఫ్లైట్ రాడార్ 24 ప్రకారం.. మే 4న రాత్రి 8.42 గంటలకు భారత్ గగనతలంలోకి ప్రవేశించిన పాక్ విమానం.. పంజాబ్‌లోని భిఖివిండ్ పట్టణం ఉత్తరంలో చక్కెర్లు కొట్టినట్టు చూపించింది. తిరిగి పాకిస్థాన్‌లోకి ప్రవేశించే ముందు తరాన్ తరాన్ సిటీ మీదుగా ప్రయాణించింది. అయితే, ఈ ఘటన సమయంలో ఐఏఎఫ్ ఎటువంటి యుద్ధ విమానాలను పంపలేదని అధికార వర్గాలు తెలిపాయి.
కౌలాలంపూర్, బ్యాంకాక్‌కు సహా విదేశాలకు భారత గగనతలం మీదుగా విమానాలను నడపడానికి పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్‌కు అనుమతి ఉంది. అలాగే, అనేక భారతీయ విమానయాన సంస్థలు పాకిస్తాన్ గగనతలం మీదుగా పశ్చిమ దేశాలకు రోజువారీ విమానాలను నడుపుతున్నాయి. భారత్-పాకిస్తాన్ సరిహద్దు సమీపంలో లాహోర్ ఉన్నప్పటికీ.. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌లు ఎల్లప్పుడూ విమానాల సురక్షిత కార్యకలాపాలకు ప్రాధాన్యత ఇస్తారు. ఈ సందర్భంలో పీఐఏ బోయింగ్ 777 ద్వారా ప్రణాళిక లేని రూట్ మళ్లింపు గురించి ఢిల్లీ ఎయిర్ ట్రాఫిక్ నియంత్రణను హెచ్చరించింది.