కేరళలో జరిగిన పడవ ప్రమాదంలో మృతుల సంఖ్య 22కి చేరింది. మలప్పురం జిల్లా తూవల్‌తీరం తనూర్ ప్రాంతంలో ఆదివారం సాయంత్రం ఈ దుర్ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. మృతుల్లో ఏడుగురు చిన్నారులు ఉన్నట్టు అధికారులు తెలిపారు. టూరిస్టులతో ఉన్న పడవ బోల్తా పడటంతో ప్రమాదం జరిగింది. సామర్ధ్యానికి మించి బోటులో పర్యాటకులను ఎక్కించడంతోనే ప్రమాదం జరిగినట్టు ప్రాథమికంగా నిర్దారించారు. బోటు యజమానిపై కేసు నమోదుచేసినట్టు పోలీసులు తెలిపారు. అయితే, ప్రమాద సమయానికి బోటులో ఎంత మంది ఉన్నారనేది మాత్రం స్పష్టత లేదు. 40 మంది టిక్కెట్లు తీసుకోగా.. కొందరు టిక్కెట్ లేకుండా ఎక్కినట్టు తెలుస్తోంది. అంతేకాదు, పడవకు ఎటువంటి సేఫ్టీ సర్టిఫికెట్ లేదని గుర్తించారు.
గల్లైంతన వారికోసం అండర్ వాటర్ కెమెరాల సాయంతో ఎన్డీఆర్ఎఫ్ బలగాలు గాలిస్తున్నాయి. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ సహా పలువురు నేతలు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కేంద్రం తరఫున బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2.2 లక్షలు ఆర్ధిక సాయం ప్రధాని ప్రకటించారు.
‘మలప్పురంలో పడవ ప్రమాదం ఘటన వార్త తీవ్రంగా కలిచివేసింది.. విషాదకర ఘటనలో ప్రియమైనవారిని కోల్పోయిన కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను.. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను.. రెస్క్యూ ఆపరేషన్‌లో అధికారులకు కాంగ్రెస్ కార్యకర్తలు సాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను’ అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.
మరోవైపు, ఘటనా స్థలాన్ని కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ సోమవారం సందర్శించనున్నారు. అంతేకాదు, ఘటనకు సంతాపంగా సోమవారం జరగాల్సి అన్ని ప్రభుత్వం కార్యక్రమాలను వాయిదా వేస్తున్నట్టు సీఎం ప్రకటించారు.