ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీఎం పదవి కోసం సచిన్ పైలట్ విశ్వప్రయత్నాలు,,, అశోక్ గెహ్లాట్ ఆరోపణ

national |  Suryaa Desk  | Published : Mon, May 08, 2023, 10:39 PM

గత 2020లో సచిన్ పైలట్ వర్గం తిరుగుబాటు చేసినప్పుడు ప్రభుత్వం కూలిపోకుండా మాజీ సీఎం, బీజేపీ నేత వసుంధర రాజే సింధియా, మరో ఇద్దరు నేతలు తనకు సాయం చేశారనిరాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ బాంబు పేల్చారు. కేంద్ర మంత్రి అమిత్ షా తమ ప్రభుత్వాన్ని కూలదోయడానికి కుట్ర చేశారని ఆయన ఆరోపించారు. జులై 2020లో సచిన్‌ పైలట్‌ తోసహా పలువురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల తిరుగుబాటుతో రాజస్థాన్‌లోని అశోక్‌ గెహ్లాట్ సర్కారులో సంక్షోభం ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గెహ్లాట్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.


ధోల్‌పూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో అశోక్ గెహ్లాట్ మాట్లాడుతూ.. ‘‘కేంద్ర మంత్రులు అమిత్ షా, గజేంద్ర సింగ్ షెకావత్, ధర్మేంద్ర ప్రధాన్‌లు కలిసి 2020 జులైలో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు కుట్ర చేశారు.. ఈ క్రమంలో తమ పార్టీకి చెందిన కొంతమంది ఎమ్మెల్యేలకు డబ్బు ఎరగా వేశారు.. అయితే.. బీజేపీ నేతలు వసుంధర రాజే, మాజీ స్పీకర్ కైలాశ్‌ మేఘ్‌వాల్, ఎమ్మెల్యే శోభారాణి కుష్వాహల వల్లే మా ప్రభుత్వం నిలిచింది. గతంలో బీజేపీ సర్కారును కూల్చివేయడం అన్యాయంగా భావించి.. పార్టీ రాష్ట్ర చీఫ్‌గా నేను మద్దతు ఇవ్వలేదు.. అదే విధంగా.. 2020లోనూ మా ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు రాజే, మేఘ్‌వాల్, కుష్వాహలు బీజేపీకి మద్దతు ఇవ్వలేదు’ అని గెహ్లాట్ పేర్కొన్నారు.


‘వారు రాజస్థాన్‌లో డబ్బు పంపిణీ చేశారు.. ఇప్పుడు డబ్బును తిరిగి తీసుకోవడం లేదు. వారి నుంచి (ఎమ్మెల్యేలు) డబ్బు ఎందుకు తిరిగి డిమాండ్ చేయడం లేదని నేను ఆశ్చర్యపోతున్నాను.. తిరుగుబాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డబ్బును తిరిగి ఇవ్వాలని, కాబట్టి వారు ఎటువంటి ఒత్తిడి లేకుండా తమ బాధ్యతను నిర్వర్తించగలరని ఆయన అన్నారు.. రూ. 10 కోట్లు లేదా రూ. 20 కోట్లు తీసుకున్నా మీరు ఏదైనా ఖర్చు చేసి ఉంటే, ఆ భాగాన్ని నేను ఇస్తానని లేదా కాంగ్రెస్ నుంచి తీసుకుంటానని ఎమ్మెల్యేలకు కూడా చెప్పాను’ అని అన్నారు.


డబ్బులు తీసుకున్న ఎమ్మెల్యేలు కూడా ఎటువంటి ఒత్తిడి లేకుండానే తమంతట తాముగా నగదును తిరిగిచ్చేయాలని సూచించారు. కాంగ్రెస్‌ తనను మూడుసార్లు ముఖ్యమంత్రిని చేసిందని, ఈ ఏడాది చివర్లో జరగనున్న ఎన్నికల్లో పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకురావడమే తన కర్తవ్యమని తెలిపారు. ఇదిలా ఉండగా, గెహ్లాట్ వ్యాఖ్యలపై మాజీ సీఎం వసుంధర రాజే స్పందించారు. ఎమ్మెల్యేలు డబ్బులు లంచంగా తీసుకున్నట్టు ఆధారాలుంటే కేసు నమోదుచేయాలని ఆమె డిమాండ్ చేశారు.


కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై ఆరోపణలను తోసిపుచ్చిన రాజే.. రాజస్థాన్‌లో ఎవరూ చేయని విధంగా తనను అవమానించారని మండిపడ్డారు. 2020లో రాజస్థాన్‌లో నెల రోజులపాటు సాగిన రాజకీయ సంక్షోభానికి కాంగ్రెస్‌ పార్టీ హైకమాండ్ జోక్యంతో తెరపడిన విషయం తెలిసిందే. అనంతరం సచిన్‌ పైలట్‌ను డిప్యూటీ సీఎం, పీసీసీ అధ్యక్ష పదవి నుంచి తొలగించారు.


మరోవైపు, గెహ్లాట్, రాజేలు ఒకరి విషయంలో మరొకరు.. ముఖ్యంగా అవినీతి వ్యవహారాల్లో చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. సొంత పార్టీ నేతలే విమర్శలు చేస్తున్నారు. రాజే ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై చర్యలు తీసుకోవాలని ఇటీవల సచిన్ పైలట్‌ దీక్ష కూడా చేపట్టారు. అయితే, పరస్పర సహకార ఆరోపణలను ఇరు నేతలు కొట్టిపారేశారు.


ఇదిలావుంటే గెహ్లాట్ వ్యూహాత్మకంగా ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. రెండు వైపులా పదునైన కత్తిలా అటు రాజేను.. ఇటు పైలట్‌ను తాజా వ్యాఖ్యలతో ఇరకాటంలోకి నెట్టే ప్రయత్నం చేశారు. రాజస్థాన్‌లో మళ్లీ కాంగ్రెస్ విజయం సాధించిన సందర్భంలో సీఎం పదవిపై పైలట్ వాదనకు సవాల్‌గా ఉండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com