హోటల్‌లో దిగిన ఓ పర్యాటకుడికి భయానక అనుభవం ఎదురయ్యింది. బసచేసిన గదిలోని మంచం కింద మృతదేహం ఉన్నట్టు తెలిసి షాకయ్యాడు. చైనాకు చెందిన పర్యాటకుడు తనకు ఎదురైన ఈ అనుభవాన్ని సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నాడు. చైనాకు చెందిన జంగ్ అనే వ్యక్తి అంతర్జాతీయ పర్యటనలో భాగంగా టిబెట్‌ను చుట్టిరావాలని ఇటీవల ప్లాన్ చేసుకున్నాడు. అందుకోసం వీసా దగ్గరి నుంచి హోటల్ బుకింగ్ దాకా అన్నీ ముందస్తుగానే చేసుకున్నాడు. షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 20న టిబెట్ రాజధాని లాసాలో అడుగుపెట్టిన జంగ్.. ముందుగా బుక్ చేసుకున్న హోటల్‌కు వెళ్లగా.. వాళ్లు కేటాయించిన గది తనకు ఏమాత్రం నచ్చలేదని చెప్పాడు.
ఆ గదిలోకి అడుగుపెట్టగానే దుర్వాసన రావడంతో తొలుత ఆ వాసన తన షూలో నుంచి వస్తోందని భావించాడు.. కొద్ది సేపటి తర్వాత గది కిందే ఉన్న బేకరీ నుంచి వస్తోందని అనుకున్నానని వివరించాడు. దుర్వాసన భరించలేకపోవడంతో హోటల్ మేనేజర్‌ను కలిసి వేరే గదికి మార్పించాలని ఫిర్యాదు చేశాను.. ఆపై చుట్టుపక్కల ప్రాంతంలోని టూరిస్టు ప్రదేశాలను చూసేందుకు వెళ్లాను అని తెలిపాడు. ఆ ప్రదేశాల తిరిగొచ్చేసరికి తన కోసం పోలీసులు ఎదురుచూడటంతో షాకయ్యానని పేర్కొన్నాడు.
స్టేషన్‌కు తీసుకెళ్లిన తర్వాత అంతకుముందు ఉన్న గదిలో మంచం కింద మృతదేహం ఉన్నట్టు తనకు తెలిసిందన్నాడు. శవం గురించి హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. తనను స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించారని జంగ్ వెల్లడించాడు. అదే రోజు ఉదయమే రావడం, విమానం టికెట్లు, వీసా, పాస్‌పోర్ట్ లను పరిశీలించిన తర్వాత తనను వదిలిపెట్టారని వివరించాడు. చాలా రోజులుగా ఆ మృతదేహం అక్కడే ఉందని నిర్దారణకు రావడంతో తాను ఏ కేసూ లేకుండా బయటపడ్డానని తెలియజేశాడు.
బెడ్ కిద మృతదేహం గదిలో తాను దాదాపు ఓ పూట గడిపానని తలచుకుంటే ఒళ్లు జలదరిస్తోందని అన్నాడు. ఆ షాక్ నుంచి తాను ఇంకా తేరుకోలేదని, కళ్లముందు ఇంకా మెదులాడుతుండటంతో నిద్ర కూడా పట్టడం లేదని వివరించాడు. రోజూ రాత్రి 2 గంటల నుంచి 3 గంటల మధ్య మెలుకువ వచ్చేస్తోందని చెప్పాడు. ఈ సంఘటన తర్వాత ఆ మర్నాడు ఉదయాన్నే తాను టిబెట్ నుంచి తిరుగుపయనమై వచ్చేశానని చెప్పాడు. కాగా, ఈ హత్యకు పాల్పడిన నిందితుడిని టిబెట్‌కు 2 వేల కిలోమీటర్ల దూరంలోని లాన్‌ఝంగ్‌లో అరెస్టు చేసినట్లు టిబెట్ పోలీసులు ప్రకటించారు.