కొంతకాలంగా రాష్ట్రంలోని పారిశ్రామిక ప్రగతి, రాష్ట్రానికి వస్తున్న ప్రాజెక్టులను చూసి తట్టుకోలేక ఎల్లో మీడియా తప్పుడు వార్తలు రాస్తున్నాయని, వారి రాతలు రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసేలా, ప్రజల ఆలోచన విధానాన్ని మార్చాలనే ప్రయత్నంలా కనిపిస్తోందని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ అన్నారు. చంద్రబాబును గద్దెనెక్కించాలి అనే వారి తపన చూస్తే నిజంగా జాలేస్తోందన్నారు. ఎలాగోలా చంద్రబాబు, టీడీపీని అధికారంలోకి తీసుకురావాలని రామోజీ, రాధాకృష్ణ, టీవీ5లు తపన పడుతున్నారన్నారు. చంద్రబాబు వస్తే మళ్లీ ప్రజలందరికీ గ్రాఫిక్స్ చూపి మోసం చేసి దోచుకోవాలనేదే వారి ఆలోచన అన్నారు. విశాఖలో రూ.22 వేల కోట్ల పెట్టుబడితో దేశంలోనే మొదటి సారిగా అదానీ డేటా సెంటర్ ఏర్పాటుకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారని గుర్తుచేశారు. ఉత్తరాంధ్ర ప్రజల కలైన భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు రూ. 4200 కోట్లతో శంకుస్థాపన, శ్రీకాకుళంలో ప్రతిష్టాత్మకమైన మూలపేట పోర్టును రూ.4300 కోట్లతో శంకుస్థాపన జరిగిందన్నారు. ఈ నెల 22వ తేదీన రూ.5వేల కోట్ల విలువైన బందరు పోర్టు శంకుస్థాపన జరగబోతోందని మంత్రి గుడివాడ అమర్‌నాథ్ చెప్పారు.