టీడీపీ నేతలు ఆదిరెడ్డి అప్పారావు, ఆదిరెడ్డి వాసులకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. గత నెల 30 వ తేదిన అప్పారావు, వాసులను సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్నారు. జగజ్జననీ చిట్ ఫండ్ కంపెనీ కేసులో వీరిద్దరినీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. జగజ్జననీ చిట్ ఫండ్ కంపెనీలో చట్ట వ్యతిరేక ఆర్థిక లావాదేవీలు జరుపుతున్నారని పేర్కొంటూ చిట్స్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ (కాకినాడ) ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మంగళగిరి సీఐడీ పోలీసులు గత నెల 29న ఆదిరెడ్డి అప్పారావు, ఆదిరెడ్డి వాసుపై కేసు నమోదు చేశారు. ఆ మరుసటి రోజు సీఐడీ అధికారులు వారిద్దరినీ అరెస్ట్ చేసి తూర్పుగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ముందు హాజరు పరచగా రిమాండ్ విధించారు.