ఏపీలో రైతులు పరిస్థితి చాలా దుర్భరంగా ఉందని రైతు సంఘం నాయకులు ప్రభాకర్ రెడ్డి విమర్శించారు. క్షేత్ర స్థాయిలో పరిశీలన చేయకుండా మంత్రులు ప్రకటనలు చేస్తున్నారన్నారు. తమ బృందం కృష్ణా, గోదావరి జిల్లాల్లో పర్యటన చేసిందన్నారు. రైతు భరోసా కేంద్రం వద్ద రైతులు పడిగాపులు పడుతున్నారన్నారు. కనీసం గోనె సంచులు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. అధికార పార్టీ నేతల అండ ఉంటే వెంటనే సంచులు ఇస్తున్నారన్నారని ప్రభాకర్ రెడ్డి విమర్శించారు. రైతులకు గోనె సంచులు ఇవ్వకుంటే ధాన్యం ఎలా తోలాలని ప్రశ్నించారు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా రైతులే మిల్లర్లను ఆశ్రయించేలా చేస్తుందన్నారు. తేమ శాతం, నూక, రవాణా పేరుతో అమ్మకానికి కూడా రైతు పెట్టుబడి పెట్టాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ప్రభుత్వం చేసే ప్రకటనలకు, క్షేత్ర స్థాయిలో జరిగే అంశాలకు అసలు పొంతనే లేదన్నారు. ప్రభుత్వమే రైతు నుంచి పూర్తిగా ధాన్యం కొనుగోలు చేయాలన్నారు. మొక్కజొన్న రైతులు కూడా తీవ్రంగా నష్ట పోయారని... ప్రభుత్వం వారిని ఆదుకోవాలని ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు.