టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర విజయవంతంగా దూసుకెళ్తోంది. ఈరోజు కోడుమూరు నియోజకవర్గంలో 95వ రోజు పాదయాత్ర మొదలవగా కాసేపటికే నందికొట్కూరు నియోజకవర్గంలోకి ప్రవేశించింది. కొద్దిదూరం పాదయాత్ర చేయగా అల్లూరులో 1200 కిలోమీటర్ల మైలురాయికి యువగళం చేరుకుంది. ఈ సందర్భంగా మిడుతూరు ఎత్తిపోతల పథకానికి లోకేష్ శిలాఫలకం ఆవిష్కరించారు. అనంతరం లోకేష్ మాట్లాడుతూ... ‘‘జనగళమే యువగళమై మహోజ్వలంగా సాగుతున్న యువగళం పాదయాత్ర ఈరోజు నందికొట్కూరు నియోజకవర్గం అల్లూరులో 1200 కి.మీ మైలురాయిని చేరుకోవడం ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా హంద్రీనీవా నుంచి మిడుతూరు ఎత్తిపోతల పథకానికి శిలాఫలకాన్ని ఆవిష్కరించాను. ఈ ఎత్తిపోతల పథకం ద్వారా మిడుతూరు, కలమండలపాడు, మాదిగుండం, పారమంచాల చెరువులకు నీరు చేరుతుంది. తద్వారా 22వేల ఎకరాలకు సాగునీరు, మిడుతూరు, జూపాడుబంగ్లా మండలాల్లో 60వేల మంది ప్రజలకు తాగునీరు అందుతుంది’’ అంటూ లోకేష్ పేర్కొన్నారు. ఈరోజు నందికొట్కూరు నియోజకవర్గంలో బ్రాహ్మణకొట్కూరు, వడ్డెమాను, అల్లూరు, నందికొట్కూరులో లోకేష్ యువగళం పాదయాత్ర చేయన్నారు.