ప్రతి సంవత్సరం జాబ్ కేలండర్ విడుదల చేస్తానని చెప్పిన జగన్ మోసం చేయడంతో యువత పెడతారి పట్టే ప్రమాదం పొంచి ఉందని నారా లోకేష్ అభిప్రాయపడ్డారు. పాదయాత్రలో భాగంగా అయన మాట్లాడుతూ.... ఇప్పటికే పలువురు గంజాయి బానిసలుగా మారి తమ జీవితాలను నాశనం చేసుకున్నారన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ, ప్రైవేటు, స్వయం ఉపాధి రంగాల్లో అవకాశాలు మెరుగుపర్చి నిరుద్యోగాన్ని అరికడతామన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గతంలో మాదిరి పెళ్లికానుకలను పునరుద్ధరిస్తామని చెప్పారు. డి.ఫారం పట్టాలకు రిజిస్ట్రేషన్ అంశాన్ని.. కర్నాటక రాష్ట్ర విధానాలను పరిశీలించి పరిష్కరిస్తామన్నారు. మహిళలకు ప్రోత్సాహకాలు ఇచ్చి పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఎస్సీల సామాజిక న్యాయానికి టీడీపీ కట్టుబడి ఉంటుందని లోకేష్ స్పష్టం చేశారు.