కృష్ణా జిల్లా పెనమలూరు మండలం పెదపులిపాక శివారున ఈ ఘటన జరిగింది. విజయవాడ క్రీస్తురాజపురానికి చెందిన జమ్మలమూడి జీవన్ (20) కొత్తపేటలోని పొట్టి శ్రీరాములు ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. తండ్రి సుధాకర్ ఓ హోటల్ వద్ద వాచ్‌మన్‌గా పనిచేస్తున్నాడు. తల్లి ఇంటివద్దనే ఉంటుంది. ఇంట్లో జరిగిన వివాదం కారణంగా రెండు రోజులుగా ఇంటికి వెళ్లకుండా స్నేహితులతో తిరుగుతున్నాడు. మంగళవారం ఉదయం ఇంటికి వెళ్లాడు. రాత్రి ఏడు గంటల ప్రాంతంలో స్నేహితుడు శ్యామ్ పుట్టినరోజు పార్టీ ఉందని తల్లితో చెప్పి బయటకు వచ్చాడు. క్రీస్తురాజపురానికి చెందిన ఐదుగురు స్నేహితులతో కలిసి విజయవాడ గురునానక్ కాలనీలో ఉన్న అవర్ ప్యాలస్‌లో ఓయో రూంకు వెళ్లి స్నేహితుడికి కేట్‌కట్ చేసి సరదాగా గడిపారు. అవర్ ప్యాలస్‌లో జీవన్ స్నేహితుడు రాజమండ్రి సాయి... బాయ్‌గా పనిచేస్తున్నాడు. రాత్రి పది గంటల సమయంలో సాయికి చెందిన స్కూటీ తీసుకుని ఇంటికి వెళ్లి వస్తానని చెప్పి హోటల్ నుంచి బయటకు వచ్చాడు. ఎంత సేపటికీ జీవన్ రాకపోవడంతో సాయి నిద్రపోయాడు. స్కూటీపై బయటకు వచ్చిన జీవన్ యనమలకుదురు శివాలయం ఎదురుగా ఉన్న పెట్రోలు బంకు వద్దకు వెళ్లి సీసాలో పెట్రోలు కొట్టమంటే సిబ్బంది తిరస్కరించారు. తర్వాత ఒంటి గంట ప్రాంతంలో తిరిగి అదే బంక్ వద్దకు వచ్చి పెట్రోలు పోయించుకున్నాడు. డబ్బులను గూగుల్‌పే చేశాడు. అక్కడి నుంచి పెదపులిపాక గ్రామంలోని చినకట్ట ప్రాంతానికి వెళ్లి తండ్రి సుధాకర్‌కు ఫోన్ చేశాడు. తండ్రి ఈఎంఐ చెల్లించమని ఇచ్చిన రూ.12 వేలను ఖర్చు చేశానని చెప్పాడు. తన వల్ల ఎలాంటి ఉపయోగం లేదని చెప్పి, ఫోన్‌ను తల్లికి ఇవ్వమని చెప్పాడు. తల్లితో కాసేపు మాట్లాడాడు. తండ్రి ఆరోగ్యం బాగోకపోవడంతో జాగ్రత్తగా చూసుకోవాలని తల్లికి చెప్పాడు. ఇవన్నీ ఇంటికి వచ్చిన తర్వాత మాట్లాడుకుందామని తల్లి చెప్పింది. తల్లి మాట్లాడుతుండగానే జీవన్ ఫోన్ కట్ చేశాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు. చినకట్ట వద్ద ఉన్న నిర్మానుష్య ప్రాంతంలో కాలిపోయిన జీవన్ మృతదేహం బుధవారం ఉదయం కనిపించింది. సమాచారం అందుకున్న పెనమలూరు పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. జీవన్ మృతదేహానికి ఉయ్యూరు ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు.