రాష్ట్రంలో విద్యార్థులకు అమలు చేస్తున్న పథకాల కింద వైసీపీ ప్రభుత్వం రూ.5,000 కోట్లు బకాయి పడిందని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. విద్యా దీవెన, వసతి దీవెన పథకాలు బకాయి దీవెనలుగా మారాయని ఎద్దేవా చేసింది. అవి ఎప్పుడు వస్తాయో తెలియక విద్యార్థులు తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారని ఆ పార్టీ ధ్వజమెత్తింది. ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి పీతల సుజాత బుధవారం ఇక్కడ తమ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం కొత్తగా రాలేదని, టీడీపీ హయాంలో ఎన్ని కష్టాలున్నా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పగడ్బందీగా అమలు చేశామని వివరించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఈ డబ్బు కళాశాలలకు ఇవ్వడానికి ఏళ్ల సమయం పడుతోందని ఆరోపించారు. తమకు పాత బకాయిలు ఇంకా రూ.400 కోట్లు రావాలని కళాశాలల యాజమాన్యాలు చెబుతున్నాయని తెలిపారు. జగన్ ప్రభుత్వం 40ు ఫీజులు సరిగ్గా కట్టడం లేదని హైకోర్టు కూడా పేర్కొందని చెప్పారు. ‘‘ప్రభుత్వం నుంచి రావాల్సిన డబ్బులు రాక కళాశాలల నడపలేక యాజమాన్యాలు ఫీజుల కోసం విద్యార్థులపై ఒత్తిడి తెస్తున్నాయి. దీనితో ఏం చేయాలో తెలియక విద్యార్ధులు కళాశాలలకు వెళ్లడం మానేస్తున్నారు. డబ్బులు చెల్లించలేక అనేక మంది విద్యార్ధులు తమ సర్టిఫికెట్లు కూడా కళాశాలల నుంచి తెచ్చుకోలేకపోతున్నారు’’ అని సుజాత ఆవేదన వ్యక్తం చేశారు.