టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర 96వ రోజు నందికొట్కూరు నియోజకవర్గంలో కొనసాగుతోంది. ఈరోజు ఉదయం నందికొట్కూరులో పాదయాత్ర ప్రారంభమవగా... యువనేతను తర్తూరు గ్రామస్తులు కలిశారు. తాము పడుతున్న బాధలను లోకేష్ ముందు ఏకరువుపెట్టారు. నందికొట్కూరు నియోజకవర్గం తర్తూరు గ్రామస్తులు యువనేత లోకేష్‌ను కలిసి సమస్యలను విన్నవించారు. తమ గ్రామంలో 2,200 జనాభా ఉన్నారని.. గ్రామానికి తూర్పువైపున 3,500 ఎకరాల పొలాలు ఉన్నాయన్నారు. టీడీపీ ప్రభుత్వం వచ్చాక లిఫ్ట్ ఇరిగేషన్ మంజూరుచేసి తమ పొలాలకు నీరందించాలని కోరారు. తమ గ్రామంలో ప్రతి ఏటా ఏప్రిల్‌లో 20రోజుల పాటు జాతర జరుగుతుందని.. జాతరలో తీవ్ర నీటి ఎద్దడి ఎదుర్కొంటున్నామన్నారు. మహమ్మద్ కుంటలో అధికారపార్టీ నాయకులు అక్రమ గ్రావెల్ తవ్వకాలు చేపట్టడంతో ఇబ్బందిగా ఉందని.. అఢ్డుకుంటే కేసులు పెడుతున్నారని వాపోయారు. వైసీపీ నాయకుడు, సర్పంచ్ మేనమామ టీటీడీ ఈఓగా పనిచేస్తున్నారు. ఆయన అండదండలతో అధికారాన్ని ఉపయోగించి తమపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని తెలిపారు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే తమపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తేయాలని కోరారు.