కడప జిల్లా, తంబళ్లపల్లె నియోజకవర్గంలోని ములకలచెరువు, తంబళ్లపల్లె, కురబలకోట, పెద్దమండ్యం, బి.కొత్తకోట మండలాల్లో కుక్కల బెడద ఎక్కువగా ఉంది. ప్రధాన రహదారులు, వీధుల్లో కుక్కలు గుంపులు గుంపులుగా సంచరిస్తూ రోడ్డ పక్కన నడుచుకుంటూ వెళ్తున్న వారిపై దాడులు చేస్తున్నాయి. అలాగే ఇళ్ల ముందు ఆడుకుంటున్న పిల్లలు, రాత్రి వేళల్లో ఇళ్ల ముందు పడుకుంటున్న వారిపై దాడి చేసి కరుస్తున్నాయి. అలాగే ద్విచక్రవాహనదారులను వెంబడిస్తున్నాయి. ఏడాది కాలంలో తంబళ్లపల్లె నియోజకవర్గంలోని ఆరు మండలాల పరిధిలో ఉన్న ప్రభుత్వాస్పత్రుల్లో 280 వరకు కుక్క కాటు కేసులు నమోదయ్యాయి. కుక్కల బారిన పడుతున్నవారిలో చిన్నపిల్లలు కూడా ఎక్కువగా ఉం టున్నారు. ములకలచెరువుకు చెందిన ఓ మహిళ పిచ్చికుక్క దాడిలో గాయపడి మృతి చెందింది. నీరు, ఆహారం వెతుకుంటూ గ్రామ సమీ పాల్లో వస్తున్న జింకలు, నెమళ్లపై కూడా కుక్కల గుంపులు దాడి చేస్తుండడంతో మృత్యువాత పడుతున్నాయి. గొర్రెలు, పశువులపై దాడి చేస్తున్నాయి. సంబంధిత అధికారులు స్పందించి కుక్కల బెడద నుంచి రక్షించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.