విజయనగరం జిల్లా మెంటాడ మండలం కొండలింగాలవలస పంచాయితీ కొండమామిడివలస గ్రామానికి చెందిన బోయిన మురళి (26), రెడ్డివానివలస గ్రామానికి చెందిన గుమ్మిడిసోములు(30) స్నేహితులు. మురళి, సోము పక్కపక్క గ్రామానికి చెందినవారు. వీరిద్దరూ గత కొంతకాలంగా గుంటూరు తదితర ప్రాంతాలకు ఉపాధికోసం వెళ్లారు. ఇటీవలే స్వగ్రామాలకు వచ్చారు. ఈ నేపథ్యంలో బందలుప్పి గ్రామానికి చెందిన యువకునితో స్నేహం ఏర్పడింది. పార్వతీపురం జిల్లా బందలుప్పిలో బుధవారం రాత్రి స్నేహితుడి పెళ్లి. దీంతో ఇద్దరూ ద్విచక్ర వాహనంపై బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరారు. అయితే దాదాపు 3 గంటలకు పార్వతీపురం మండలం దిబ్బగుడ్డివలస వద్ద వెళ్తున్నారు. గమ్యస్థానం ఇంకా పది కిలోమీటర్లు ఉంది. మరో పదిహేను నిమిషాల ప్రయాణం అంతే. అంతలోనే ఊహించని ఘోరం జరిగిపోయింది. వీరి బైక్ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. మురళి అక్కడికక్కడే మృతి చెందాడు. అటుగా వెళ్తున్న వారు వెంటనే సోములు పార్వతీపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సోములు అక్కడ చికిత్స పొందుతూ రాత్రి 8 గంటల సమయంలో చనిపోయాడు. మురళికి ఇంకా వివాహం కాలేదు. సోములకు భార్య రాములమ్మ, ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరి కుటుంబసభ్యులు పోడి వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇద్దరు స్నేహితుల మృతితో ఆయా గ్రామాలలో విషాధ చాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఔట్‌పోస్టు పోలీసులు తెలిపారు.