రాష్ట్రంలో యువత జీవితాలను నాశనం చేస్తున్న గంజాయి నిర్మూలనకు సమర్థులైన పోలీస్ అధికారులతో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను నియమించాలని ప్రభుత్వాన్ని తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు డిమాండ్ చేశారు. విశాఖపట్టణం నగరంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఒకప్పుడు అన్నపూర్ణగా పేరుగాంచిన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు గంజాయిలో ప్రథమ స్థానంలో ఉండడం అత్యంత విచారకరమన్నారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత తొలిసారిగా విశాఖలో ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన పోలీస్ ఉన్నతాధికారులు గంజాయిని అరికట్టడానికి సమావేశం ఏర్పాటుచేయడం సంతోషకరమన్నారు. అయితే పొరుగునున్న ఒడిశా నుంచి గంజాయి రవాణా అవుతుందని పోలీస్ అధికారులు చెప్పడాన్ని ఆయన తప్పుబట్టారు. విశాఖ ఏజెన్సీలో గంజాయిని ఎవరు పండిస్తున్నారో?, ఎవరు అమ్ముతున్నారో?...పోలీస్ ఉన్నతాధికారులకు తెలుసునని, అయితే ప్రభుత్వ చాతకానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు పొరుగు రాష్ట్రంపై నెపాన్ని నెట్టివేయడం వింతగా ఉందన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పాలనలో మాఫియా, దోపిడీ, అక్రమ వ్యాపారాలు జోరుగా సాగుతున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో ఉపాధి లేక యువత వలసపోతున్నారని, ఈ దశలో కొందరు తప్పుడు మార్గాలను ఎంచుకుని గంజాయి రవాణాలో భాగస్వామ్యులు కావడం ఆందోళన కలిగిస్తోందన్నారు.