అకాల వర్షాలకు పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని తెలుగుదేశం పార్టీ అనుబంధం విభాగం తెలుగు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి నారాయణరెడ్డి అన్నారు. గురువారం రైతులకు పరిహారం అందించాలంటూ తెలుగు రైతు కమిటీ ప్రతినిధులు కర్నూలు డీఆర్వోకు వినతిపత్రం అందజేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అకాల వర్షాలకు నాలుగు లక్షల ఎకరాల్లో ధాన్యం, మామిడి, మొక్కజొన్న, ఉల్లి, మిరప తదితర పంటలన్నీ పూర్తిగా నీటిలో తడిసిపోయి పాడైపోయాయని, ప్రభుత్వం ఆదుకోకుంటే ఆత్మహత్యలే శరణ్యమంటూ రైతులు కన్నీటిపర్యంతమవుతున్నారని తెలిపారు. ఎకరాకు రూ.25 వేల చొప్పున పరిహారం అందించాలని, పండ్ల తోటలకు రూ.50 వేల ఆర్థిక సాయం ఇవ్వాలని, పిడుగుపాటుకు గురై మరణించిన మృతుల కుటుంబాలకు రూ.25లక్షలు అందించాలని కోరారు. కార్యక్రమంలో రైతు కమిటీ నాయకులు హనుమంతరావు చౌదరి, తదితరులు పాల్గొన్నారు.