కర్ణాటక సీఎం అభ్యర్థి ఎంపిక వ్యవహారం రోజురోజుకు సజీవంగా మారుతుంది. కర్ణాటక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డీకే శివకుమార్ ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. వీరిద్దరితో సమావేశమైన అనంతరం మీడియా ప్రతినిధులు డీకే శివకుమార్ ను పలకరించారు. వారితో ఏమీ చర్చించలేదని, కేవలం ప్రణామ్ (నమస్కారం) చేశానని చెప్పారు. కర్ణాటక ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై కాంగ్రెస్ అధిష్ఠానం ఇంకా తేల్చలేదు. డీకే శివకుమార్, సిద్ధరామయ్య రేసులో ఉన్నారు. ఇరువురు నేతలు పదవి కోసం గట్టిగా పట్టుబడుతున్నట్లుగా కనిపిస్తోంది. దీంతో అధిష్టానం వారితో వరుసగా చర్చలు జరుపుతోంది.
కర్ణాటకలోని రామనగర జిల్లాలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. రామనగర డీకే శివకుమార్ సొంత జిల్లా. ముఖ్యమంత్రి అభ్యర్థిగా సిద్ధరామయ్యను ప్రకటించనున్నారని, ఈ మేరకు దాదాపు నిర్ణయం జరిగిందని వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో శివకుమార్ మద్దతుదారులు రామనగరలో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉద్రిక్తతలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తగా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.