తొలిసారిగా 16 బోగీలతో సికింద్రాబాద్ నుంచి తిరుపతికి బయలుదేరిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్.. ముందుగా అనుకున్న సమయానికంటే 15 నిమిషాల ముందే గమ్యస్థానాన్ని చేరుకుంది. 8.15 గంటల్లోనే వందేభారత్ తిరుపతికి చేరుకుందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. సికింద్రాబాద్-తిరుపతి-సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో బోగీల సంఖ్య పెంచాలంటూ ప్రయాణికుల నుంచి డిమాండ్లు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. దీంతో, రైల్వే శాఖ వందేభారత్‌లో బోగీలను 8 నుంచి 16కు పెంచింది. దాంతో, రైల్లో సీట్ల సంఖ్య 530 నుంచి 1128కు పెరిగింది. ప్రస్తుతం వందేభారత్‌లో ఎగ్జిక్యూటివ్ క్లాస్‌లో 104 సీట్లు, ఛైర్ కార్‌లో 1024 సీట్లు ఉన్నాయి.
బుధవారం నాటి తొలి ట్రిప్ కోసం 1228 మంది ప్రయాణికులు టిక్కెట్ బుకింగ్ చేసుకున్నారు. కాగా, తొలిట్రిప్‌లో భాగంగా తిరుపతికి 109శాతం ఆక్యుపెన్సీ రేషియోతో వందేభారత్ ప్రయాణించినట్టు అధికారులు తెలిపారు. రానూపోనూ ప్రయాణాలకు 130 శాతం ఓఆర్ ఉన్నట్టు పేర్కొన్నారు.