విజయనగరం పట్టణంలోని టీడీపీ అధ్యక్షుడు పరవాడ రమణమూర్తి నేతృత్వంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆ పార్టీని వీడి వైయస్ఆర్‌సీపీ తీర్థం పుచ్చుకున్నారు. బుధవారం విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి సమక్షంలో టీడీపీ నేతలు వైయస్ఆర్‌సీపీలో చేరారు. వారికి వీరభద్రస్వామి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వీరభద్రస్వామి మాట్లాడుతూ..ఇవాళ వైయస్ జగన్ పరిపాలనకు అన్ని వర్గాల నుంచి ఆమోదం లభిస్తుందని, ఇతర పార్టీల నేతలు కూడా మద్దతుగా నిలుస్తున్నారని తెలిపారు. నాలుగేళ్లుగా వైయస్ జగన్ సుపరిపాలన అందిస్తూ దేశంలోనే ఆదర్శ ముఖ్యమంత్రిగా నిలిచారన్నారు. ఏపీలో అమలవుతున్న నవరత్నాల పథకాలు ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా మారాయన్నారు. అర్హతే ప్రమాణికంగా సంక్షేమపథకాలు అందించిన ఘనత ముఖ్యమంత్రి వైయస్ జగన్‌దే అన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి సీఎం వైయస్ జగన్ పెద్దపీట వేశారని, ఇందుకు సజీవ సాక్ష్యమే ఇటీవల భోగాపురం ఏయిర్ పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారన్నారు. త్వరలోనే విశాఖ కేంద్రంగా పరిపాలన సాగబోతుందని చెప్పారు. విజయనగరంలో సుదీర్ఘ కాలంగా ఉన్న మంచి నీటి సమస్యకు పరిష్కారం చూపామన్నారు. పని చేసే వ్యక్తులకే ప్రాతినిధ్యమన్నారు. వైయస్ఆర్‌సీపీ కార్యకర్తలు నిరంతరం ప్రజల మధ్య ఉంటూ..వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. పార్టీలో చేరిన వారికి అండగా ఉంటానని, ప్రజాభ్యుదయ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. అందరూ స్నేహభావంతో పని చేస్తూ మళ్లీ వైయస్ జగన్‌ను ముఖ్యమంత్రిని చేసుకుందామన్నారు. మనందరం ఐక్యమత్యంగా ఉంటూ ఒకే కుటుంబంగా మెలగాలని సూచించారు.