ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకు ఉద్యమం చేస్తున్న ఎమ్మార్పీఎ్‌సకు మద్దతుగా నిలిచిన వారికే రానున్న ఎన్నికల్లో మహాజన సోషలిస్టు పార్టీ (ఎంఎ్‌సపీ) అండగా నిలుస్తుందని ఆ పార్టీ నాయకుడు, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ తెలిపారు. బుధవారం సాయంత్రం నెల్లూరు జిల్లా కందుకూరులో ఎమ్మార్పీఎస్, దాని అనుబంధ సంఘాల నాయకులతో ఆయన సమావేశం నిర్వహించి భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణపై చర్చించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ విషయంలో ఎమ్మార్పీఎస్ చేస్తున్న న్యాయమైన ఉద్యమానికి టీడీపీ అధినేత చంద్రబాబు చాలావరకు సహకరించారని పేర్కొన్నారు. మాట తప్పను, మడమ తిప్పను.. అని గొప్పలు చెప్పుకునే సీఎం జగన్ ఆయన చెప్పేది నిజమైతే ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకు అనుకూలంగా అసెంబ్లీలో తీర్మానం చేయించటంతోపాటు తన పార్టీ ఎంపీలతో పార్లమెంటులో మాట్లాడించి, వర్గీకరణ ఉద్యమాన్ని కేంద్రపెద్దలు గుర్తించేలా చేయాలని డిమాండ్ చేశారు. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి కూడా ఎమ్మార్పీఎస్ ఉద్యమానికి మద్దతిస్తామని, అసెంబ్లీలో తీర్మానం చేయిస్తానని మాట ఇచ్చాడు కానీ నెరవేర్చలేదని గుర్తుచేశారు. తన తండ్రి ఇచ్చిన మాటను నెరవేర్చటం ద్వారా జగన్ మాట తప్పను, మడమ తిప్పను నినాదాన్ని రుజువు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పవన్‌కల్యాణ్ కూడా ఎస్సీ వర్గీకరణపై తన వైఖరిని ప్రకటించాల్సిన అవసరం ఉందన్నారు. మూడు ప్రధాన రాజకీయ పార్టీలతోపాటు ఎన్నికలలో ప్రభావం చూపగలిగిన పార్టీ మహాజన సోషలిస్టు పార్టీ మాత్రమేనని ఆయన వివరించారు. అందుకే మాకు ఎవరు మద్దతిస్తే వారికి మేము అండగా నిలుస్తామని స్పష్టం చేశారు. త్వరలో గ్రామస్థాయి నుంచి ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామన్నారు.