ఓ విద్యార్థి ఈత సరదా రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. సహచరులతో కలిసి క్వారీ మడుగు వద్దకు వెళ్లిన విద్యార్థుల్లో ఒకరు ఈత సరదాతో అందులోకి దిగి గల్లంతవ్వగా, అతడిని రక్షించేందుకు దిగిన మరో విద్యార్థి ఆచూకీ లేకుండా పోయాడు. ఈ సంఘటన విశాఖ నగర పరిధిలోని పెందుర్తి నియోజకవర్గంలోని నరవ సమీపంలో గురువారం మధ్యాహ్నం జరిగింది. మృతదేహాల వెలికితీత కోసం శుక్రవారం కూడా గాలింపు చర్యలు చేపట్టారు. అయినప్పటికీ ఇంకా మృతదేహాలు బయటపడలేదు. బంధువులు, స్నేహితులు, స్థానికులు భారీగా క్వారీ చెరువు వద్దకు చేరుకున్నారు. కళశాల యాజమాన్యం తీరుపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నరవ గ్రామంలోని విశాఖ ఇంజనీరింగ్ కళాశాలలో పాలిటెక్నిక్ చదువుతున్న బీహెచ్‌పీవీ ప్రాంతానికి చెందిన బండారు నిఖిల్ (17), అనకాపల్లి సమీపంలోని లక్ష్మీదేవిపేట ప్రాంతానికి చెందిన మళ్ల రాజేశ్ (17) గురువారం ఉదయం తరగతులకు హాజరయ్యారు. మధ్యాహ్నం కళాశాల విడిచిపెట్టిన తరువాత సహచర విద్యార్థులతో కలిసి సమీపంలోని క్వారీ తవ్వకాలు చేపట్టిన ప్రదేశంలో వున్న నీటి మడుగు వద్దకు వెళ్లారు.
వారిలో మళ్ల రాజేశ్ స్నానం చేసేందుకు మడుగులో దిగాడు. అయితే అతడికి ఈత రాకపోవడంతో నీటిలో మునిగిపోయాడు. ఒడ్డున వున్న నిఖిల్ అది గమనించి సమీపంలో వున్న మిత్రులకు ఫోన్ చేశాడు. అంతేకాకుండా మునిగిపోతున్న రాజేశ్‌ను కాపాడేందుకు నీటిలోకి దిగాడు. మడుగు చాలా లోతు ఉండడంతో అతడు కూడా మునిగిపోయాడు. సమీపంలో వున్న మిత్రులు సంఘటనా స్థలానికి చేరుకునే సరికి ఇద్దరు విద్యార్థులు నీటిలో మునిగిపోయారు. దీంతో వారు వెంటనే కళాశాల సిబ్బందికి సమాచారం అందించారు. కళాశాల చైర్మన్ జి. సత్యనారాయణ పెందుర్తి పోలీసులకు విషయం తెలియపరచడంతో సీఐ గొలగాని అప్పారావు, సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గజ ఈతగాళ్లు, అగ్నిమాపక సిబ్బంది సాయంతో నీటి మడుగులో గాలింపు చర్యలు చేపడుతున్నారు. కాగా రాత్రి వరకు విద్యార్థుల ఆచూకీ లభించలేదు. భోరున విలపిస్తున్న కుటుంబీకులుమడుగులో గల్లంతైన నిఖిల్ తండ్రి రామారావు నరవ గ్రామంలో విద్యుత్ శాఖ లైన్‌మన్‌గా పనిచేస్తున్నారు. రాజేశ్ తండ్రి మృతి చెందగా, అతడి తల్లి సునీత అదే గ్రామంలో కేబుల్ టీవీ ఆపరేటర్ వద్ద పనిచేస్తున్నారు. కుమారులు గల్లంతైనట్టు కళాశాల సిబ్బంది సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న వారి కుటుంబసభ్యులు తమ పిల్లలను తలచుకుని గుండెలు అవిసేలా రోదిస్తున్నారు. ఈ సమాచారం తెలిసి స్థానికులు, కళాశాల యాజమాన్యం, విద్యార్థులు సంఘటన స్థలానికి పెద్దసంఖ్యలో చేరుకున్నారు. కాగా ఈ నీటి మడుగులో ఈతకు దిగి ఇప్పటికే పలువురు ప్రాణాలు కోల్పోయారని, వెంటనే రక్షణ వలయం ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.