పల్లె బద్రి జనాభా అంత పట్నం బాట పడుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో ప్రస్తుతమున్న నగరాలపై జనాభా ఒత్తిడిని తగ్గించేందుకు కేంద్రం కొత్త నగరాల ఏర్పాటు దిశగా యోచిస్తోంది. దేశంలో మొత్తం ఎనిమిది నగరాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు తాజాగా వెల్లడించారు.
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరంలో గురువారం జరిగిన ‘అర్బన్ 20’ సమావేశానికి కేంద్ర పట్టణ వ్యవహారాలు, గృహ నిర్మాణ శాఖ జీ20 యూనిట్ డైరెక్టర్ ఎంబీ సింగ్ హాజరయ్యారు. సభ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కొత్త నగరాల గురించి ప్రస్తావించారు. 15వ ఆర్థిక సంఘం కొత్త నగరాలను ఏర్పాటు చేయాలని సూచించినట్టు తెలిపారు. పలు రాష్ట్రాలు ఆర్థిక సంఘం సిఫార్సులను అనుసరించి 26 కొత్త నగరాల కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపాయని వెల్లడించారు. ఈ క్రమంలో కేంద్రం 8 కొత్త నగరాల ఏర్పాటు అంశాన్ని పరిశీలిస్తోందని చెప్పారు.