కొన్ని కొన్ని సందర్భాలలో మన వ్యూహాలు మనకే చుట్టుకుంటాయి. ఇలాంటి ఘటన ఇటీవల లండన్లు చోటు చేసుకుంది. తనపై లైంగిక వేధింపులకు దిగాడంటూ పైఅధికారిని, కంపెనీని బోనెక్కించిన ఓ మహిళ ఉద్యోగికి చుక్కెదురైంది. తాను పనిచేస్తున్న కంపెనీకి మహిళ రూ.5.1 లక్షలు చెల్లించాలంటూ ఎంప్లాయిమెంట్ ట్రైబ్యునల్ తాజాగా ఆదేశించింది. లండన్‌లో ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళితే.. కరీనా గాస్పరోవా ఈఎస్ఎస్‌డాక్స్ అనే సంస్థలో పనిచేస్తోంది.
ఇటీవల మహిళ పైఅధికారి ఆమెకు ఓ మెయిల్ పంపించాడు. అందులో కొన్ని కంపెనీల పేర్లకు బదులు ఎక్స్, వై అక్షరాలు, ప్రశ్నార్థకంతో రాసిన అతడు వాటి స్థానంలో తగిన పదాలు పూరించాలని కోరాడు. కానీ, యువతి మాత్రం బాస్ తనను లైంగికంగా వేధించేందుకే ఈ మెయిల్ చేసినట్టు భావించింది. ఎక్స్ అంటే చుంబనలని, వై అంటే మరింత దగ్గరయ్యేది ఎప్పుడని బాస్ పరోక్షంగా ప్రశ్నించాడని భావించింది. దీంతో, అతడితో పాటూ కంపెనీని కూడా కోర్టుకు ఈడ్చింది. కంపెనీ కూడా తనపై వివక్ష ప్రదర్శిస్తూ ఉద్యోగంలోంచి తొలగించిందని ఆరోపించింది. పైఅధికారి గతంలోనూ తనకు దగ్గరయ్యేందుకు ప్రయత్నించాడని చెప్పుకొచ్చింది.
తన ఆరోపణలకు ఆధారంగా బాస్ రాసిన లేఖను కోర్టులో సమర్పించింది. అయితే, ఈ లేఖను నిశితంగా చదివిన న్యాయమూర్తి లేఖలో దురుద్దేశమేదీ లేదని నిర్ణయించారు. బాస్ రాసిన ఈమెయిల్‌ను మహిళ తప్పుగా అర్థం చేసుకుందని స్పష్టం చేశారు. రోజువారీ జరిగే ఘటనలను ఆమె తప్పుగా అర్థం చేసుకుందని అభిప్రాయపడ్డారు. ‘‘సరయిన ఆధారాలు లేకుండానే మహిళ అసాధారణ ఆరోపణలు చేసినట్టుగా కనిపిస్తోంది. పలుమార్లు పరస్పర విరుద్ధమైన ఆరోపణలు చేసింది. ఇది పొరపాటు వల్ల జరిగిందని అనుకోలేం’’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసిన న్యాయస్థానం.. కంపెనీకే మహిళ 5 వేల పౌండ్లు (సుమారు రూ.5 లక్షలు) చెల్లించాలని ఆదేశించింది.