జపాన్ కు చెందిన ఓ కంపెనీ ఖరీదైన ఐస్ క్రీమ్ తయారు చేసింది. దీని ధరను 8,73,400 జపాన్ యెన్ లుగా నిర్ణయించింది. మన రూపాయిల్లో చెప్పాలంటే, రూ.5.2 లక్షలు! ఖరీదైన అరుదైన పదార్థాలతో జపాన్ కు చెందిన సెల్లాటో కంపెనీ ఈ ఐస్ క్రీమ్ ను తయారు చేసింది. దీన్ని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ కూడా గుర్తించింది. ఇటలీలో పెరిగే వైట్ ట్రఫిల్ ను కూడా ఇందులో వినియోగించారు. ఇక ఈ ఐస్ క్రీమ్ తయారీలో మరింత ఆశ్చర్యం కలిగించే విషయం.. దీన్ని తయారు చేసేందుకు ఏడాదిన్నర సమయం పట్టినట్టు కంపెనీ ప్రతినిధి ప్రకటించారు.
మరి, అంతకాలం ఎందుకు అనుకుంటున్నారా..? ఎన్నో ప్రయోగాలు చేసిన తర్వాతే తుది ఉత్పత్తిని తీసుకొచ్చారు. ఒకదాని తర్వాత ఒకటి తయారు చేసి రుచి చూస్తే.. చివరికి వారికి నచ్చినట్టు ఆకారం, రుచిని సాధించడానికి అంత సమయం తీసుకుంది. ప్రపంచంలో ఖరీదైన ఐస్ క్రీమ్ తయారు చేయాలన్న సంకల్పంతోనే దీన్ని రూపొందించారు. కానీ, దీని ధరను చూసిన వారే.. ఓ మై గాడ్ అంటూ కామెంట్ చేస్తున్నారు.