రాష్ట్రంలో ఎస్సీ విద్యార్థుల కోసం ప్రస్తుతం ఉన్న నీట్, జేఈఈ శిక్షణా కేంద్రాలు కాకుండా అదనంగా మరో శిక్షణా కేంద్రాన్ని విశాఖ జిల్లాలోని మధురవాడలో ప్రారంభించనున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున వెల్లడించారు. ఎస్సీ గురుకుల విద్యార్థులు పదోతరగతి, ఇంటర్ పరీక్షల్లో మరింత మెరుగైన ఫలితాలను సాధించేందుకు వీలుగా 56 అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ కేంద్రాలను కూడా ఏర్పాటు చేసామని చెప్పారు. రాష్ట్ర సచివాలయంలో మంగళవారం జరిగిన బీఆర్ అంబేద్కర్ ఎస్సీ గురుకుల విద్యాలయాల సంస్థ జిల్లా కో ఆర్డినేటర్ల (డీసీఓ)ల సమీక్షా సమావేశంలో నాగార్జున మాట్లాడుతూ, ప్రస్తుతం రాష్ట్రంలో ఎస్సీ బాలుర కోసం అడవి తక్కెళ్లపాడు (గుంటూరు జిల్లా), చిన్నటేకూరు (కర్నూలు జిల్లా) లోనూ, బాలికల కోసం ఈడ్పుగల్లు (కృష్ణాజిల్లా) లోనూ నీట్, జేఈఈ శిక్షణా కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం ఈ శిక్షణా కేంద్రాలకు ఉన్న డిమాండ్ ను దృష్టిలో ఉంచుకొని బాలికల కోసం మరో శిక్షణా కేంద్రాన్ని మధురవాడలో ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఈ శిక్షణా కేంద్రంలో 160 మంది బాలికలకు శిక్షణ ఇవ్వనున్నామని తెలిపారు. ఎస్సీ గురుకులాలు పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల్లో రాష్ట్ర సగటును మించి ఫలితాలను సాధించాయని ప్రస్తావించారు. గురుకులాల విద్యార్థులు పదో తరగతిలో 80. 38%శాతం, ఇంటర్మీడియట్ లో 74. 13% శాతం ఫలితాలను సాధించారని చెప్పారు. అయితే పదో తరగతి ఫలితాల్లో ఒక జిల్లా వెనుకబడిందని, ఆ జిల్లాలో రాష్ట్ర సగటు కంటే తక్కువగా 71% శాతం ఫలితాలు మాత్రమే వచ్చాయని తెలిపారు.