తెలుగు ప్రజల కీర్తిని కాపాడుకునేందుకు ఆత్మగౌరవం స్ఫూర్తితో మరోసారి పోరాడాలని, ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తన అసమర్థ పాలనతో రాష్ట్ర పరువును తాకట్టు పెడుతున్నారని తెదేపా జిల్లా అధ్యక్షుడు జీవీ. ఆంజనేయులు అన్నారు. సాతులూరులో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ, నటరత్న ఎన్టీఆర్ కళాపరిషత్ జాతీయస్థాయి నాటికల పోటీలను గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజమే దేవాలయమని, ప్రజలే దేవుళ్లు అని చాటిన మహానీయుడు ఎన్టీఆర్ అన్నారు. ఆయన పేరు తెలుగుజాతి ఉన్నంత వరకు చిరస్మరణీయమన్నారు. మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ సినీ, రాజకీయ రంగాల్లో చరిత్ర సృష్టించిన ఘనత ఎన్టీఆర్‌కే దక్కిందన్నారు. డాక్టరు చదలవాడ అరవిందబాబు మాట్లాడుతూ జగన్ ప్రజావ్యతిరేక విధానాలకు మూల్యం చెల్లిస్తారన్నారు. రాక్షస పాలనకు రోజులు దగ్గరపడ్డాయన్నారు. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం న్యాయవాది నర్రా శ్రీనివాసరావు, పారిశ్రామికవేత్త గడ్డం బుచ్చారావు, తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు కుమ్మెత కోటిరెడ్డి, సర్పంచి శోభారాణి, నాయకులు బండారుపల్లి సత్యనారాయణ, కమ్మ శ్రీనివాసరావు, వసంతరావు, నడింపల్లి వెంకటేశ్వర్లు, నార్నె శ్రీనివాసరావు పాల్గొన్నారు.