ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సెల్ ఫోన్ కోసం భారీ మోటార్లు పెట్టి రిజర్వాయర్‌లో నీరు ఖాళీ.

national |  Suryaa Desk  | Published : Sat, May 27, 2023, 07:45 PM

మిత్రులతో సరదాగా ఎంజాయ్ చేసేందుకు వచ్చిన ఓ ప్రభుత్వ అధికారి చిత్ర విచిత్రంగా ప్రవర్తించాడు. సెల్ఫీలు తీసుకునే క్రమంలో రిజర్వాయర్‌‌‌లో తన ఫోన్ పడేసుకున్నాడు. ఆ తర్వాత ఆ ఫోన్ కోసం జలాశయం నుంచి ఏకంగా 21 లక్షల లీటర్ల నీళ్లను ఖాళీ చేయించారు. ఇందు కోసం 30 హెచ్ పీ సామర్థ్యం గల రెండు భారీ మోటార్లను మూడు రోజుల పాటు నిరంతరాయంగా నడిపించారు. ఇలా వృథా చేసిన నీటితో ఏకంగా 1500 ఎకరాలకు సాగు నీరు అందించే అవకాశం ఉండేది. ఈ అధికారి తీరు ఇప్పుడు వివాదాస్పదమైంది. ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లాలో చోటు చేసుకున్న ఈ వ్యవహారం సంచలనంగా మారింది.


రాజేశ్‌ విశ్వాస్‌ అనే వ్యక్తి ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్‌ జిల్లాలో ఫుడ్‌ ఆఫీసర్‌గా పని చేస్తున్నారు. గత ఆదివారం (మే 20) అతడు తన స్నేహితులతో కలిసి పరల్‌కోట్‌ డ్యామ్‌ సందర్శనకు వచ్చాడు. అక్కడ సెల్ఫీలు తీసుకుంటుండగా ప్రమాదవశాత్తూ ఆయన స్మార్ట్‌ఫోన్‌ అక్కడి ఓవర్‌ ఫ్లో ట్యాంక్‌ నీళ్లలో పడిపోయింది. శామ్‌సంగ్‌ ఎస్‌ 23 మోడల్ ఆ ఫోన్ విలువ రూ. 96 వేలు.  ఖరీదైన ఫోన్‌ రిజర్వాయర్‌లో పడిపోవడంతో రాజేశ్ కంగారుపడ్డారు. స్థానికుల సాయం కోరడంతో కొంత మంది గజ ఈతగాళ్లను రప్పించారు. 15 అడుగుల లోతైన ఆ రిజర్వాయర్‌ నీటిలోకి దిగి వాళ్లు ఫోన్ కోసం గాలించారు. కానీ, వారి ప్రయత్నాలు ఫలించలేదు. జలాశయం అడుగు భాగంలో బురద, రాళ్లు ఉన్నాయని తెలిపారు. దీంతో రాజేశ్.. నీటి పారుదల శాఖలో తనకు తెలిసిన అధికారులను సంప్రదించి సాయం కోరాడు.


జల వనరుల విభాగం అధికారి నుంచి మౌఖికంగా ఆదేశాలు అందుకున్న సిబ్బంది.. రెండు భారీ మోటార్లతో హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. రిజర్వాయర్‌లోని నీటిని ఖాళీ చేయించడం ప్రారంభించారు. సోమవారం సాయంత్రం ప్రారంభమైన మోటార్లు.. గురువారం వరకూ నిరంతరాయంగా పనిచేశాయి. కేవలం 3 రోజుల్లోనే 21 లక్షల లీటర్ల నీళ్లను బయటకు తోడేశాయి. ఫోన్ కోసం రిజర్వాయర్‌లోని నీటిని తోడేస్తున్న విషయం వెలుగులోకి రావడంతో ఈ వ్యవహారంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. స్పందించిన జలవనరుల విభాగం వెంటనే ఆ ప్రక్రియను నిలిపివేయించింది.


ఈ ఘటనపై సదరు అధికారి రాజేశ్ విశ్వాస్‌ను వివరణ కోరగా.. తన తప్పేమీ లేదని చెప్తుండటం కొసమెరుపు. ఆ రిజర్వాయర్‌లోని నీటిని ఏ అవసరాల కోసం వినియోగించడంలేదని స్థానికులే చెప్పారని, నీళ్లను తోడేస్తే ఫోన్ దొరుకుతుందని కూడా వారే సలహా ఇచ్చారని అతడు చెప్పాడు. జల వనరుల శాఖకు చెందిన అధికారులు కూడా ఇదే విషయాన్ని చెప్పారని, మోటార్లతో నీటిని తోడేశారని చెప్పుకొచ్చాడు. అంతేకాదు, ఆ ఫోన్‌లో కీలకమైన ప్రభుత్వ సమాచారం ఉందని, అందుకే వెతికించే ప్రయత్నం చేశానని.. లేకపోతే వదిలేసేవాడినని రాజేశ్ చెప్పాడు.  మూడు రోజుల పాటు మోటార్లను నడిపించడం ద్వారా రిజర్వాయర్‌లో ఆరు అడుగుల మేర నీటిమట్టం తగ్గింది. చివరికి ఆ ఆ ఫోన్‌ దొరికినప్పటికీ.. మూడు రోజుల పాటు అది నీటిలో ఉండటం వల్ల పని చేయడంలేదు.


ఈ వ్యవహారంపై ఛత్తీస్‌గఢ్‌లో రాజకీయంగానూ దుమారం రేగుతోంది. జనం ఒకవైపు తాగు నీటి కోసం ట్యాంకర్లపై ఆధారపడుతుంటే.. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు మాత్రం, మోటార్లతో నీళ్లను తోడి వృథా చేశారని మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత రమణ్ సింగ్ దుయ్యబట్టారు. ఈ ఘటనపై రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అమర్‌జీత్ భగత్‌ స్పందన కోరగా.. ఆ ఘటన తన దృష్టికి రాలేదని చెప్పారు. సాగు నీటితో పాటు తాగు నీటికి కూడా రిజర్వాయర్ ఉపయోగపడుతుందని, వేసవిలో జంతువులు సైతం దాహార్తిని తీసుకుంటాయని స్థానికులు చెబుతున్నారు.  ఈ వ్యవహారం కాస్త వివాదాస్పదం కావడంతో.. సదరు అధికారిపై కలెక్టర్‌ సస్పెన్షన్‌ వేటు వేశారు. రిజర్వాయర్ నుంచి నీటిని తోడేందుకు అదేశాలిచ్చిన నీటి వనరుల శాఖ అధికారి జీతంలో కోత విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com