దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద రెజ్లర్లు ఆందోళనకు యోగా గురు బాబా రాందేవ్ మద్దతు పలికారు. బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. దేశంలో ఇలాంటి పరిస్థితి రావడం సిగ్గుచేటు అని రాందేవ్ బాబా అన్నారు. వేధింపులకు పాల్పడే వ్యక్తుల్ని వెంటనే అరెస్టు చేసి.. జైల్లో పెట్టాలని సూచించారు. మహిళల గురించి బ్రిజ్ భూషణ్ చాలా చెత్తగా మాట్లాడుతున్నాడని.. అతని తీరును ఖండించాల్సిందేనని తేల్చిచెప్పారు. బ్రిజ్‌భూషణ్‌పై దిల్లీ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినా.. ఇప్పటికీ అరెస్టు చేయకపోవడంపై మీడియా ప్రశ్నించగా.. తాను కేవలం ప్రకటనలు మాత్రమే చేయగలనని తెలిపారు. అతడ్ని జైల్లో పెట్టే అధికారం తనకు లేదని రాందేవ్ బాబా బదులిచ్చారు. ఈ సందర్భంగా రాందేవ్ బాబా పలు వ్యాఖ్యలు చేశారు. తాను అన్ని ప్రశ్నలకు రాజకీయంగా బదులివ్వగలనని.. తానేమీ మానసిక వికలాంగుడిని కాదని తేల్చిచెప్పారు. దేశం పట్ల నాకో విజన్ ఉంది. నేను రాజకీయంగా ఏదైనా ప్రకటనలు చేస్తే.. అవి ఎన్నో మలుపులు తిరుగుతాయి’ అని రాందేవ్ బాబా అన్నారు.
ఆదివారం జరగనున్న పార్లమెంట్ ప్రారంభోత్సవానికి బ్రిజ్ భూషణ్ హాజరైతే.. దేశంలో నెలకొన్న పరిస్థితుల గురించి స్పష్టమైన సందేశం ప్రజలకు వెళ్తుందని రెజ్లర్ వినేశ్ ఫొగాట్ అన్నారు. బ్రిజ్‌భూషణ్‌కు ఎవరు మద్దతు పలికినా వారు తమకు వ్యతిరేకమేనని ఆమె స్పష్టం చేశారు. ప్రభుత్వంలో అంతర్గతంగా ఏం జరుగుతుందో తమకు తెలియదు కానీ.. కొంతమంది మాత్రం బ్రిజ్ భూషణ్‌ను రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. అది సరేంది కాదని వినేశ్ ఫొగాట్ పేర్కొన్నారు. దేశంలోని ఆడబిడ్డలకు బ్రిజ్ భూషణ్ హాని చేస్తున్నారు’ అని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు.