ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నీతి ఆయోగ్ భేటీకి గైర్హాజరు..... వివిధ కారణాలు వెల్లడించిన సీఎంలు

national |  Suryaa Desk  | Published : Sat, May 27, 2023, 07:46 PM

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్‌ పాలక మండలి సమావేశం దేశ రాజధాని ఢిల్లీలో శనివారం మధ్యాహ్నం ప్రారంభమైంది. పాలక మండలిలో సభ్యులుగా ఉన్న పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్‌ గవర్నర్లు, పలువురు కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులు ఈ భేటీలో పాల్గొన్నారు. అయితే ఈ నీతి ఆయోగ్ సమావేశానికి 9 రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కాలేదు. ఈ భేటీకి గైర్హాజరు అవుతున్నట్లు తెలంగాణ, పంజాబ్, దిల్లీ, పశ్చిమ బెంగాల్, బిహార్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, రాజస్థాన్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇప్పటికే ప్రకటించారు. అయితే వీరంతా కాంగ్రెస్ సహా దేశంలో అధికార బీజేపీని వ్యతిరేకిస్తున్న పార్టీలకు చెందిన వారు కావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.


నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశం గైర్హాజరీకి సంబంధించి ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కారణాలు చెప్పారు. దిల్లీ ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసులు, బదిలీల విషయమై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కాదని.. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ నేపథ్యంలో నీతి ఆయోగ్‌ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు దిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రకటించారు. దేశంలో సహకార సమాఖ్య వ్యవస్థకు మోదీ సర్కార్ తూట్లు పొడుస్తోందని కేజ్రీవాల్ విమర్శలు గుప్పించారు. పంజాబ్ రాష్ట్రానికి నిధుల కేటాయింపు విషయంలో కేంద్రం వివక్ష చూపిస్తోందని ఆరోపిస్తూ ఈ సమావేశానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ చెప్పారు.


నీతి ఆయోగ్‌ సమావేశానికి తాను రాలేనని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారు. అయితే బెంగాల్ తరఫున రాష్ట్ర ఆర్థిక మంత్రి, చీఫ్‌ సెక్రటరీని పంపించేందుకు అనుమతినివ్వాలని దీదీ సర్కార్ విజ్ఞప్తి చేసింది . అయితే ఈ అభ్యర్థనను కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది. ముందస్తుగా నిర్ణయించిన కార్యక్రమాల నేపథ్యంలో నీతి ఆయోగ్ సమావేశానికి రాలేకపోతున్నామని బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్‌.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. అనారోగ్య కారణాల వల్ల నీతి ఆయోగ్‌ సమావేశానికి రావడం లేదని రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్ ప్రకటించారు. సింగపూర్‌, జపాన్‌ పర్యటనలో ఉన్న తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ కూడా నీతి ఆయోగ్ సమావేశానికి హాజరు కాలేకపోతున్నానని తెలిపారు.


కర్ణాటకలో ఇటీవల కొలువుదీరిన కాంగ్రెస్ సర్కార్ శనివారం కేబినెట్‌ విస్తరణ చేసింది. దీంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నీతి ఆయోగ్ సమావేశానికి రాలేకపోయారు. ఇక ఈ భేటీకి రాలేనని ప్రకటించిన కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌.. అందుకు గల కారణాలను మాత్రం ఆయన వెల్లడించలేదు. అయితే 2024 సార్వత్రిక ఎన్నికల్లో మోదీని ఓడించడమే లక్ష్యంగా బీజేపీయేతర పక్షాలు.. విపక్షాల ఐక్యతకు ప్రయత్నిస్తున్న వేళ.. ఇది కీలక పరిణామంగా మారింది. ఈ భేటీకి గైర్హాజరైన 9 రాష్ట్రాల ముఖ్యమంత్రులు విపక్షాలకు చెందిన వారే కావడం గమనార్హం.


ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్‌ పాలక మండలి ఎనిమిదో సమావేశం నిర్వహించారు. ‘వికసిత్ భారత్ @ 2047’ అనే థీమ్‌తో ఈ భేటీ నిర్వహిస్తున్నారు. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా.. ఆరోగ్యం, నైపుణ్యాల అభివృద్ధి, మహిళా సాధికారత, మౌలికసదుపాయల వృద్ధి వంటి అంశాలపై ఈ నీతి ఆయోగ్ భేటీలో చర్చించనున్నారు. కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్‌ సింగ్‌, నిర్మలా సీతారామన్‌, స్మృతి ఇరానీ, పీయూష్‌ గోయల్‌, ధర్మేంద్ర ప్రధాన్‌, నారాయణ్‌ రాణె సహా పలువురు కేంద్రమంత్రులు, ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com