మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీఎం జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉందని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) చెప్పలేదా? అని మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి ప్రశ్నించారు. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావును పదవి నుంచి దింపేయడం తప్పయితే.. చిన్నాన్న వివేకానంద రెడ్డిని చంపిన వారిని ఏమనాలని ప్రశ్నించారు. వివేకానందరెడ్డి హత్య విషయంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద సీఎం జగన్మోహన్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
అలాగే, రాష్ట్ర హౌసింగ్ శాఖ మంత్రి జోగి రమేష్ వ్యాఖ్యలు దుర్మార్గమని బండారు సత్యనారాయణ మూర్తి మండిపడ్డారు. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతను, ఉద్యోగులను సీఎం జగన్ మోసం చేశారని దుయ్యబట్టారు. మేనిఫెస్టోను అమలు చేశామని చెబుతున్న మంత్రి జోగి రమేష్‌కు సిగ్గు ఉందా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో నిరుద్యోగులను మోసం చేశారని.. మేనిఫెస్టోని అమలు చేయడం ఇదేనా అని మండిపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా తెస్తానని చెప్పారని.. ఆ హామీ ఏమైందని ప్రశ్నించారు. పేద ప్రజలకు ఇళ్లు కట్టిస్తామని మేనిఫెస్టోలో పెట్టారని.. ఆ ఇళ్లు ఏమయ్యాయని నిలదీశారు. రాజమహేంద్రవరంలో అంగరంగ వైభవంగా మహానాడు జరుగుతుంటే ఓర్వలేక జోగి రమేష్‌ను ఉసిగొల్పారని దుయ్యబట్టారు. బీసీ అయిన జోగి రమేష్ గౌరవంగా బతకాలని సూచించారు. జగన్ వద్ద బంట్రోతు ఉద్యోగం చేయొద్దని జోగి రమేష్‌పై బండారు సత్యనారాయణ మూర్తి ఘాటు వ్యాఖ్యలు చేశారు. పైడివాడలో జగనన్న కాలనీ ఫౌండేషన్ కూలిపోయిందని.. దీనిపై జోగి రమేష్ చర్చకు వస్తారా? అని సవాల్ విసిరారు.