రాజమండ్రిలో మహానాడు అనే డ్రామా కంపెనీని చంద్రబాబు నడిపాడని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కురసాల కన్నబాబు దుయ్యబట్టారు. ఎన్టీఆర్‌కు నైతిక విలువలు లేవని ఆనాడు చెప్పిన చంద్రబాబు.. ఇప్పుడు అదే ఎన్టీఆర్‌ను శకపురుషుడు అంటూ కీర్తిస్తున్నాడని ఎద్దేవా చేశారు. తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు జీవితం మొత్తం వెన్నుపోట్లు, మోసాలే అని ఆయన విమర్శించారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో టీడీపీ మహానాడు వేదికగా చంద్రబాబు ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టోపై కన్నబాబు సెటైర్లు వేశారు. ఈ మేరకు కాకినాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో కన్నబాబు మాట్లాడుతూ..
ఇక, మహానాడులో చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టోపై మాజీ మంత్రి కన్నబాబు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను తీసుకువచ్చి.. ఇక్కడ తన మేనిఫెస్టోగా చంద్రబాబు చెప్తున్నారని విమర్శించారు. దేవుడు చంద్రబాబుకి ఏ మాత్రం సిగ్గు పెట్టలేదన్నారు. చంద్రబాబు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను ముందుపెట్టి.. భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి కన్నుకొడుతున్నాడని ఎద్దేవా చేశారు.
చంద్రబాబు రాష్ట్రానికి పట్టిన దరిద్రమని కన్నబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సభల్లో చంద్రబాబు ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియట్లేదని, ఆయన పూర్తిగా దిగజారి మాట్లాడుతున్నారని విమర్శించారు. చంద్రబాబుకు దేవుడు మతిమరుపు అనే వరం ఇచ్చారని ఎద్దేవా చేశారు. ఇక తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పెద్ద ఐరన్ లెగ్ అని ప్రజలు అనుకుంటున్నారని సెటైర్లు వేశారు. వీళ్ల ప్రచారయావతో నెల్లూరు జిల్లా కందుకూరులో, గుంటూరులో అమాయకులను పొట్టన పెట్టుకున్నారనని మండిపడ్డారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన పుష్కరాల్లో కూడా చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చికి అమాయకులు బలి అయ్యారని ఆరోపించారు. ఎన్టీఆర్ మరణానికి చంద్రబాబే కారణమని, ఆయన చెప్పేవన్నీ నంగనాచి కబుర్లే అని కన్నబాబు దుయ్యబట్టారు. 2014లో ముఖ్యమంత్రి అయ్యాక చంద్రబాబు పెట్టిన తొలి సంతకానికే దిక్కులేదని పేర్కొన్నారు. చంద్రబాబు తప్పుడు హామీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు.
ఇక, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉందని ఎమ్మెల్యే కన్నబాబు అన్నారు. సీఎం జగన్ ప్రతి పేదవాడి గుండె చప్పుడు వింటున్నారని పేర్కొన్నారు. టీడీపీకి బలం లేకనే మిగిలిన పార్టీలను కలుపుకునేందుకు ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి కాకపోవడానికి కూడా చంద్రబాబే కారణమని ఆరోపించారు. అయినా, టీడీపీ మహానాడులో పొత్తుల గురించి చంద్రబాబు ఎందుకు మాట్లాడలేదని కన్నబాబు ప్రశ్నించారు. ప్రస్తుతం టీడీపీ వెంటిలేటర్ మీద ఉందన్నారు. అయితే, వెంటిలేటర్‌పై ఉన్న టీడీపీని లేపేందుకు చంద్రబాబు అనుకూల మీడియా ప్రయత్నిస్తోందని ఆరోపించారు.