ఎన్నికలు ఎప్పుడు జరిగినా గెలుపు తమదే అని.. తెలుగుదేశం పార్టీ చీఫ్ చంద్రబాబు నాయుడు పదే పదే చెబుతున్నారు. దీన్ని చాలా మంది లైట్ తీసుకున్నారు. అటు ప్రత్యర్థులేమో.. 2024 తర్వాత అసలు టీడీపీ ఉండబోదని జోస్యం చెబుతున్నారు. అన్నింటికి మించి వైసీపీ చీఫ్ జగన్ దూకుడు మీద ఉన్నారు. దీంతో చాలామంది టీడీపీ కార్యకర్తలు అయోమయంలో ఉన్నారనే టాక్ వినిపించింది. సరిగ్గా ఇదే సమయంలో.. టీడీపీ యవనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభించారు.
లోకేష్ పాదయాత్రతో చాలా వరకు టీడీపీ కేడర్ యాక్టివ్ అయ్యింది. ఇక చంద్రబాబు కూడా వరుస పర్యటనలు చేస్తూ.. పలు జిల్లాల్లో కార్యకర్తల్లో జోష్ నింపే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అయినా.. కార్యకర్తల్లో ఎక్కడో కొంత అపనమ్మకం ఉందనే కామెంట్స్ వినిపించాయి. ఈ నేపథ్యంలో.. రాజమండ్రి శివారులో తెలుగుదేశం పార్టీ మహానాడును నిర్వహించింది. ఎన్టీఆర్ శత జయంతిని ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమాలకు పార్టీ శ్రేణులు, ఎన్టీఆర్ అభిమానులు తరలివచ్చారు. దీంతో నాయకులు, కార్యకర్తల్లో నమ్మకం పెరిగింది.
మహానాడు సక్సెస్‌తో టీడీపీ నాయకుల్లో జోష్ కనిపించింది. ఇదే సమయంలో పార్టీ చీఫ్ చంద్రబాబు సూపర్ సిక్స్ కొట్టారు. భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో టీడీపీ మినీ మేనిఫెస్టో ను ప్రకటించారు. 2024 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా 6 ప్రధాన హామీలను చంద్రబాబు ప్రకటించారు. వీటి పై ఇప్పుడు ఏపీలో జోరుగా చర్చ జరుగుతోంది. ఈ హామీల ప్రకటనతో తెలుగుదేశం కేడర్‌లో కూడా ఫుల్ జోష్ కనిపించింది. ముఖ్యంగా మహిళలు, యువత, రైతులను తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు చంద్రబాబు నాయుడు. ఈ వర్గాలపైనే టీడీపీ నమ్మకం పెట్టుకున్నట్టు చర్చ జరుగుతోంది.
అయితే.. ఈ హామీల ప్రకటన ట్రైలర్ మాత్రమేనని.. అసలు సినిమా ముందు ఉందని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఎన్నికల ముందు అసలైన హామీలను ప్రకటిస్తామని అంటున్నారు. చంద్రబాబు ప్రకటించిన ఆరు హామీలు.. తాము గెలుస్తామనే నమ్మకాన్ని మరింత పెంచాయని చెబుతున్నారు. అయితే.. ఇప్పటికే రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.. చంద్రబాబు ఈ హామీలను ఎలా నెర వేరుస్తారనే ప్రశ్నలు తెర పైకి వచ్చాయి. వాటికీ టీడీపీ నేతలు గట్టి సమాధానం చెబుతున్నారు. చంద్రబాబుకు సంపద సృష్టించడం తెలుసు.. దాన్ని పేదలకు పంచడం తెలుసని అంటున్నారు.