ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మరోసారి ఆలస్యం కానున్న జనగణన ప్రక్రియ,,కారణాలు ఇవే

national |  Suryaa Desk  | Published : Mon, May 29, 2023, 10:16 PM

రెండేళ్లుగా వాయిదా పడుతూ వస్తున్న జనాభా లెక్కింపు ఈ ఏడాది కూడా జరిగేలా కనిపించడం లేదు. మన దేశంలో 2024లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల తర్వాతే జనాభా లెక్కింపు ప్రక్రియ చేపట్టే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వ అధికార వర్గాలు తెలిపాయి. పదేళ్లకోసారి నిర్వహించే ఈ జనగణనను 2020 లో నిర్వహించాల్సి ఉన్నా .. కరోనా కారణంగా వాయిదా పడింది. ఆ తర్వాత కేంద్రం ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడంతో జనాభా లెక్కింపు ఆలస్యమవుతూ వచ్చింది. చివరి సారి మన దేశంలో 2011 లో జనగణన చేపట్టారు. అయితే వచ్చే ఏడాది దేశంలో లోక్‌సభతోపాటు మరికొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో.. ఆ లోపు జనాభా లెక్కింపు సాధ్యం కాదని కేంద్ర వర్గాలు వెల్లడించాయి.


2024 ఏప్రిల్‌ నెల నుంచి మే నెల మధ్య దేశంలో లోక్‌సభ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం.. సంబంధిత కార్యక్రమాలు, ప్రక్రియలను చేపట్టాల్సి ఉంది. అయితే జనగణనకు.. ఎన్నికల సంఘం చేపట్టే కార్యక్రమాల్లో పాల్గొనేది ఒకే సిబ్బంది కావడం ప్రస్తుత ఆలస్యానికి కారణమని అధికారులు వెల్లడించారు. పాలనపరమైన పరిధులు, కొత్త జిల్లాల లెక్కలవంటి వాటిపై తుది నిర్ణయానికి వచ్చే తేదీని ఈ ఏడాది జూన్‌30గా రిజిస్ట్రార్‌ జనరల్‌ – సెన్సస్‌ కమిషనర్‌ ఆఫ్‌ ఇండియా కార్యాలయం జనవరిలో స్పష్టం చేసింది. అయితే ఈ తేదీని ప్రకటించిన మూడు నెలల తర్వాత జనగణను ప్రారంభించాల్సి ఉంటుంది. అంటే అధికారిక లెక్కల ప్రకారం ఈ ఏడాది సెప్టెంబరు 30 వరకూ జనాభా లెక్కింపు సాధ్యం కాదు. అప్పటికీ జనగణన నిర్వహించే 30 లక్షలమంది ఉద్యోగుల శిక్షణకు కనీసం మరో రెండు, మూడు నెలలు పడుతుంది. ఆ సమయంలో వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల కోసం ఎన్నికల సంఘం ప్రక్రియ ప్రారంభమవుతుంది. దీంతో వచ్చే లోక్‌సభ ఎన్నికల్లోపు జనాభా లెక్కలు సాధ్యం కాదని అధికారులు చెబుతున్నారు.


వాస్తవంగా 2011 జనగణన తర్వాత 2021లో జనాభా లెక్కింపు చేపట్టాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన ప్రక్రియను 2020 ఏప్రిల్‌ 1 నుంచి సెప్టెంబరు 30 మధ్య చేపట్టాల్సి ఉంటుంది. అయితే కరోనా వైరస్ కారణంగా 2020 లో ఆ కార్యక్రమం వాయిదా పడింది. అయితే ఆ తర్వాత కొవిడ్ మహమ్మారి తగ్గిపోయినా.. అందుకు సంబంధించిన ప్రక్రియను, షెడ్యూల్‌ను కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ప్రకటించలేదు.


ఈసారి చేపట్టే కార్యక్రమం తొలి డిజిటల్‌ జనాభా గణనగా ఉంటుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రజలు సొంతంగా తమ వివరాలను సమర్పించే అవకాశాన్ని కల్పిస్తారు. దీనికి సంబంధించి సెల్ఫ్ సెన్సెస్ పోర్టల్‌ను జనగణన చేపట్టే యంత్రాంగం రూపొందించింది. ఈ ప్రక్రియలో భాగంగా దేశ పౌరులు ఆధార్‌ లేదా మొబైల్‌ నంబరును అందించాల్సి ఉంటుంది. అలాగే జనగణన పోర్టల్‌లో 31 ప్రశ్నలు రూపొందించారు. ఇంట్లో ఎంతమంది నివసిస్తున్నారు? యజమాని ఎవరు? టెలిఫోన్‌ కనెక్షన్, ఇంటర్నెట్‌ కనెక్షన్‌, మొబైల్‌ లేదా స్మార్ట్‌ఫోన్‌, సైకిల్, ద్విచక్రవాహనాలు, కారు, జీపు, వ్యాను వంటివి ఏమైనా ఉన్నాయా? తినడానికి వినియోగించే ప్రధాన ఆహార ధాన్యాలేమిటి? వంటి ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com