ఒకప్పుడు ఇంటి ముందు సాధారణంగా పెళ్లి చేసుకునే సంప్రదాయం నుంచి ప్రస్తుతం దేశ, విదేశాలు.. గాల్లో, నీటిలో ఇలా వివాహాలు చేసుకుంటున్నారు. అయితే చాలా మందికి డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవాలనే కోరిక ఉంటుంది. అందులో మనదేశంలో ఎక్కువ మంది గోవా బీచ్‌లో పెళ్లి చేసుకోవడానికి ఆసక్తి చూపుతారు. అయితే అలాంటి వారికి అక్కడి అధికారులు షాకింగ్ న్యూస్ చెప్పారు. అయితే గోవాలో వివాహం చేసుకోవాలంటే గోవా కోస్టల్ జోన్ మేనేజ్‌మెంట్ అథారిటీ - జీసీజెడ్ఎంఏ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. దానికి కొంత రుసుము కూడా చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు గోవాలో పెళ్లి చేసుకునేవారికి ఆ రుసుమును డబుల్ చేస్తూ గోవా కోస్టల్ మేనేజ్‌మెంట్ అథారిటీ నిర్ణయం తీసుకుంది. దీంతో గోవాలో పెళ్లి చేసుకునే వారి జేబులకు చిల్లు పడనుంది.
గోవాలో పెళ్లి చేసుకునేవారు 2020 ఏప్రిల్‌కు ముందు రూ.10 వేలు చెల్లిస్తే సరిపోయేది. గోవా కోస్టల్ మేనేజ్‌మెంట్ అథారిటీ.. అనుమతితో పెళ్లి చేసుకునే వారు. అయితే 2020 ఏప్రిల్‌లో ఆ రుసుమును ఒకేసారి రూ.50 వేలకు పెంచారు. తాజాగా ఈ రుసుమును రూ.50 వేల నుంచి రూ.లక్షకు పెంచుతూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ కొత్త నిబంధనల ప్రకారం ఐదు రోజులు నిర్వహించుకునేందుకు అనుమతి కోసం రూ. లక్ష చెల్లించాల్సి ఉంటుంది. వీటితోపాటు ప్రతీ రోజు పార్టీల నిర్వహణకు రూ. 10 వేలు చెల్లించాలి. పెళ్లిళ్ల కోసమే కాకుండా ఇతర కార్యక్రమాల కోసం కూడా గోవా బీచ్‌ను అద్దెకు తీసుకోవచ్చని అధికారులు వెల్లడించారు. ప్రతీ ఏడాదీ వేసవి, చలికాలాల్లో పెళ్లిళ్ల నిర్వహణకు సంబంధించిన దరఖాస్తులు భారీగా వస్తాయని గోవా కోస్టల్ అధికారి అన్నారు.
భారీగా వస్తున్న దరఖాస్తులను పరిశీలించడం భారంగా మారిందని అధికారులు తెలిపారు. ఆయా దరఖాస్తులలో చాలామంది వెయ్యిమంది అతిథులకు 800 చదరపు మీటర్ల తీరం కావాలని కోరుతుంటారని.. అందుకు అనుమతిని ఇవ్వాలని అడుగుతుంటారని చెప్పారు. పెళ్లిళ్లతో పాటు డిసెంబరు, జనవరి నెలల్లో పార్టీలు చేసుకునేందుకు దరఖాస్తులు వస్తాయని పేర్కొన్నారు. ఈ సమయంలోనే చాలామంది గోవాలో వేడుకలు చేసుకునేందుకు మొగ్గు చూపుతుంటారని తెలిపారు. ఈ పార్టీలు ముఖ్యంగా సముద్రతీరంలోని హోటళ్ల సమీపంలో జరుగుతుంటాయన్నారు. ఈ నేపధ్యంలోనే తీరంలోని హోటళ్లలో గదులు అత్యధికంగా బుక్ అవుతుంటాయని తెలిపారు. అయితే తాజాగా అధికారులు తీసుకున్న నిర్ణయంతో గోవాలో పెళ్లి చేసుకోవాలని ఆశపడిన వారికి షాక్ తగిలింది. అనుమతి కోసమే రూ.లక్ష చెల్లిస్తే మిగితా ఖర్చులు చూస్తే జేబు గుల్ల అవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.