ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం ఆదివారం అట్టహాసంగా జరిగింది. అయితే, పార్లమెంట్ భవనంలోని ఓ గోడపై ఉన్న మ్యాప్ ఆసక్తికరంగా మారింది. ఈ మ్యాప్ శతాబ్దాలకు ముందు ఉన్న భారతదేశాన్ని సూచించే విధంగా ఉంది. అందులో ప్రస్తుతం పాకిస్థాన్లో ఉన్న తక్షశిల, మరికొన్ని రాజ్యాలు కూడా ఉన్నాయి. ఈ మ్యాప్ను ట్విట్టర్‌లో షేర్ చేసిన కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి.. ‘సంకల్పం సుస్పష్టం.. అఖండ భారత్’ అంటూ ట్వీట్ చేశారు ఇక, పార్లమెంట్ భవనంలో అఖండ భారత్ మ్యాప్పై కర్ణాటక బీజేపీ కూడా స్పందించింది.
‘ఇది మనం గర్వించదగిన గొప్ప నాగరికతకు చిహ్నం’ అని ట్విట్టర్ హ్యాండిల్లో పేర్కొంది. కొత్త పార్లమెంటు భవనంలోని కళాఖండాల ఫోటోలను షేర్ చేసింది. ఇందులో పురాతన భారతదేశం, చాణక్య, సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్, బీఆర్ అంబేడ్కర్, దేశంలోని సాంస్కృతిక వైవిధ్యం కుడ్యచిత్రాలు కూడా ఉన్నాయి. ‘కొత్త పార్లమెంటులో అఖండ భారత్.. ఇది మన శక్తివంతమైన, స్వావలంబన కలిగిన భారతదేశాన్ని సూచిస్తుంది’ అని ముంబయి నార్త్-ఈస్ట్ ఎంపీ మనోజ్ కోటక్ ట్విట్టర్‌లో అన్నారు.
‘ప్రాచీన యుగాలలో భారతీయ ఆలోచనల ప్రభావాన్ని చిత్రించాలనేది మా ఆలోచన.. ఇది వాయువ్య ప్రాంతంలోని ప్రస్తుత అఫ్గనిస్థాన్ నుంచి ఆగ్నేయ ఆసియా వరకు విస్తరించింది’ నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడరన్ ఆర్ట్ డైరెక్టర్ జనరల్ అద్వైత గడానాయక్ అన్నారు. కొత్త పార్లమెంట్ భవనంలో కళాఖండాలు చిత్రీకరణలో గడానాయక్ కీలకంగా వ్యవహరించారు.
‘అఖండ భారత్’ భావన అనేది ప్రస్తుత అఫ్గనిస్థాన్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, మయన్మార్, థాయ్‌లాండ్‌లతో కూడిన భౌగోళిక ప్రాంతంతో ఉన్న అవిభక్త భారతాన్ని సూచిస్తుంది. 2019లో కేంద్ర మంత్రి అమిత్ షా ‘అఖండ భారత్’పై కీలక వ్యాఖ్యలు చేశారు. సార్వత్రిక ఎన్నికల అనంతరం 2019 ఆగస్టు 5న జమ్మూ కశ్మీర్కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370ను రద్దు చేసిన తర్వాత అఖండ భారత్ గురించి ఆయన ప్రస్తావించారు.
‘మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 75 రోజులు మాత్రమే పూర్తయ్యింది.. అంతకుముందు ప్రభుత్వాలు తమ పాలనలో చేయని పనిని మా ప్రభుత్వం చేసింది. ఆర్టికల్ 370ని రద్దు.. మోదీ ప్రభుత్వం సాధించిన పెద్ద విజయం.. 'అఖండ భారత్' చూడాలనేది సర్దార్ వల్లభాయ్ పటేల్ కల.. అయితే ఇంతవరకు ఆర్టికల్ 370 దానికి అడ్డంకిగా ఉంది’ అని అమిత్ షా వ్యాఖ్యానించారు.